సెంటిమెంట్ ని బ్రేక్ చేసి మంత్రిగా పయ్యావుల కేశవ్

పయ్యావుల రాజకీయ జీవితం 1994లో మొదలైంది. 29 ఏళ్ళ వయసులో పయ్యావులకు నందమూరి తారకరామారావు టీడీపీ తరపున ఉరవకొండ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు.

Advertisement
Update:2024-06-12 11:38 IST

30 ఏళ్ల రాజకీయ జీవితం, నాలుగు సార్లు ఎమ్మెల్యే.. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన సమర్థత ఉన్నప్పటికీ టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ మాత్రం మంత్రి కాలేకపోయారు. ఆయన గెలిస్తే టీడీపీ ఓడిపోతుందని.. ఆయన ఓడిపోతే టీడీపీ గెలుస్తుందనే సెంటిమెంట్ జనంలో బాగా పాతుకుపోయింది.

1994లో మినహా పయ్యావుల కేశవ్ గెలిచిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయింది. ఇక పయ్యావుల ఓడిపోయిన ప్రతిసారి టీడీపీ గెలిచింది. అయితే ఈసారి మాత్రం ఈ సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. టీడీపీ గెలిచింది.. పయ్యావుల కూడా గెలిచారు. ఇన్నేళ్ళూ అందని ద్రాక్షగా ఉన్న మంత్రి పదవి కూడా పయ్యావుల అందుకున్నారు. కాసేపట్లో ఆయన ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పయ్యావుల రాజకీయ జీవితం 1994లో మొదలైంది. 29 ఏళ్ళ వయసులో పయ్యావులకు నందమూరి తారకరామారావు టీడీపీ తరపున ఉరవకొండ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. తొలిసారి పయ్యావుల ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే మంత్రి పదవి మాత్రం దక్కలేదు.

ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ గెలువగా.. పయ్యావుల కేశవ్ మాత్రం ఓడిపోయారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ గెలువగా.. టీడీపీ ఓడిపోయింది. ఆ రెండు ఎన్నికల్లో పయ్యావుల ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం మళ్లీ 2014లో టీడీపీ గెలుపొందగా.. పయ్యావుల కేశవ్ మాత్రం ఓటమి చెందారు.

2019లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలుపొందగా.. జగన్ వేవ్ లో కూడా పయ్యావుల ఎమ్మెల్యేగా నెగ్గారు. అయినా మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. ఎట్టకేలకు 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించగా.. పయ్యావుల కూడా గెలుపొంది తాను గెలిస్తే టీడీపీ ఓడిపోతుంది అన్న సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు.

30 ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటిసారి పయ్యావుల మంత్రి పదవి పొందారు. పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో కూర్చొని పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసేవారు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఆయన అసెంబ్లీలో అధికార పార్టీ తరఫున, అది కూడా మంత్రిగా కనిపించనున్నారు.

Tags:    
Advertisement

Similar News