ఎన్నికల వేళ కుల గణన ఎందుకు..? ప్రభుత్వానికి పవన్ ప్రశ్న
కుల గణన చేపడితే ఆ వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని, అలా దుర్వినియోగం కాకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారని ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు.
ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కుల గణన చేపట్టడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. ఎన్నికల్లో స్వీయ ప్రయోజనం పొందడం కోసమే ఈ గణన చేపట్టారని ఆయన విమర్శించారు. ఎన్నికల వేళ కుల గణన చేపట్టడాన్ని ప్రశ్నిస్తూ ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఓ లేఖ విడుదల చేశారు.
కుల గణన చేపట్టడమే ప్రభుత్వ ఉద్దేశం అయితే ఆదాయం, భూముల వివరాలు, ఆస్తుల వివరాలు ఎందుకు తెలుసుకుంటున్నారని ప్రశ్నించారు. కుల గణన ఉద్దేశం ఎన్నికల ముందే ఎందుకు వచ్చిందని, ఈ గణన ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో చెబుతూ ప్రభుత్వపరమైన గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని అడిగారు.
జన గణన మామూలుగా నిపుణులతో చేపడుతుంటారని, మరి వైసీపీ ప్రభుత్వం నియమించిన వలంటీర్లకు కుల గణన చేసేంత అర్హత, సామర్థ్యం ఉన్నాయా? అని పవన్ నిలదీశారు. బిహార్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సుప్రీంకోర్టులో ఉండగా, దానికి సంబంధించి తీర్పు రాకముందే ఏపీలో కుల గణన సొంత ప్రయోజనాల కోసం చేపట్టారన్నారు. కుల గణన పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
కుల గణన చేపడితే ఆ వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని, అలా దుర్వినియోగం కాకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారని ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. కుల గణన చేపట్టడం వైసీపీ అధికార దాహానికి ప్రతీక అని మండిపడ్డారు.
కుల గణనకు అసలు ప్రజల అనుమతి తీసుకున్నారా? ప్రజలందరూ నియంతృత్వానికి తల వంచుతారనుకోవద్దన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని జగన్ తన స్వీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రజాస్వామ్యానికి తూట్లుపొడవడమేనని మండిపడ్డారు.
వలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం సేకరిస్తున్న కుల గణన, ఇతర వివరాలను ఏ కంపెనీలో భద్రపరుచుతారో తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలపై రాజకీయంగానే కాకుండా న్యాయపరమైన మార్గాలను కూడా విశ్లేషించే దిశగా ఆలోచిస్తామని పవన్ ఆ లేఖలో చెప్పారు.