అడ్రస్ లేని పవన్
గడచిన ఎనిమిది రోజులుగా పవన్ ఎక్కడా అడ్రస్ లేరు. రాజమండ్రి ప్రకటన చేసిన తర్వాత ఎక్కడా కనబడలేదు. ఎటుపోయారో, ఏమైపోయారో కూడా ఎవరికీ అర్థంకావటంలేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదిచేసినా ఇలాగే చేస్తారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేసి రిమాండుకు రాజమండ్రి జైలులో ఉంచారు. జైలులో ఉన్న చంద్రబాబును జనసేన అధినేత వెళ్ళి కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్మోహన్ రెడ్డిపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. జగన్ ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అని, ఇక ఉన్నది ఆరు నెలలు మాత్రమే అని చాలా వార్నింగులిచ్చారు. రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణను అమలు చేస్తాయన్నారు.
సీన్ కట్ చేస్తే గడచిన ఎనిమిది రోజులుగా పవన్ ఎక్కడా అడ్రస్ లేరు. రాజమండ్రి ప్రకటన చేసిన పవన్ తర్వాత ఎక్కడా కనబడలేదు. ఎటుపోయారో, ఏమైపోయారో కూడా ఎవరికీ అర్థంకావటంలేదు. మీడియా కనబడగానే నోటికొచ్చినట్లు ఏదో ఒక ప్రకటనచేసేయటం తర్వాత అడ్రస్ లేకుండా మాయమైపోవటం పవన్‌కు చాలా మామూలు. పవన్ ప్రకటనకు అర్థం తెలియక పార్టీ నేతలు, క్యాడర్ బుర్రగోక్కోవాలి. చంద్రబాబును రిమాండుకు పంపటం కన్నా మించిన ఇష్యు పవన్‌కు ఏముంటుంది?
నిజంగానే చంద్రబాబు అరెస్టుపై పవన్ అంత సీరియస్‌గా ఉంటే వారాహియాత్రను ఇప్పుడు మొదలుపెట్టాలి. వ్యానెక్కి పవన్ రోడ్డెక్కితే జనాల స్పందన ఏమిటో తెలిసిపోతుంది. పవన్ రోడ్డు మీదకు వస్తే అభిమానులు, జనసేన కార్యకర్తలతో పాటు టీడీపీ జనాలు కూడా కలిసొస్తారు. అప్పుడు జగన్ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యుండేది. కానీ పవన్ అలాచేయలేదు. రెండు పార్టీల మధ్య సమన్వయం చేసే బాధ్యతను జనసేన తరపున నాదెండ్ల మనోహర్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పి మాయమైపోయారు.
చివరకు సమన్వయమూ లేదు కార్యచరణా లేదన్నట్లుగా తయారైంది వ్యవహారం. ఏసీబీ కోర్టు తీర్పు తర్వాత పవన్ ఆలోచనలో మార్పొచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైకి చంద్రబాబు అరెస్ట్‌ని పవన్ గోల చేసినా స్కామ్ విషయంలో చంద్రబాబు పాత్రపై పవన్ పునరాలోచనలో పడ్డారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో హైకోర్టు కూడా చంద్రబాబు క్వాష్ పిటీషన్ను డిస్మిస్ చేయటంతో అవినీతి జరిగిందని, చంద్రబాబే కీలకపాత్రధారని అందరికీ అర్థమవుతోంది. బహుశా పవన్‌కు కూడా ఈ విషయం అర్థమయ్యుంటుంది. అందుకనే పవన్ ఎక్కడా కనబడకుండా మాయమైపోయింది.
♦