మరోసారి తన బలహీనతను చాటుకున్న పవన్‌

పి. గన్నవరంలో గత ఎన్నికల్లో జనసేనకు 36,759 ఓట్లు వచ్చాయి. అయితే, ఆ సీటును చంద్రబాబు తన పార్టీ అభ్యర్థికి ఇచ్చేశారు. అది కూడా జనసేనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్‌కు ఈ సీటును కేటాయించారు.

Advertisement
Update:2024-02-26 15:08 IST

టీడీపీతో పొత్తులో భాగంగా తమ పార్టీకి కేవలం 24 సీట్లకే అంగీక‌రించ‌డంపై పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మీద జనసేన నాయకులు మండిపడుతున్నారు. దానికితోడు పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను కేటాయించినా కూడా పవన్‌ కల్యాణ్‌ ఒప్పేసుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఏయే సీట్లు తీసుకోవాలనే విషయంపై ఆయన కసరత్తు చేయలేదని అర్థమవుతోంది. ఈ స్థితిలో తమ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ ఇచ్చిన జాబితానే పవన్‌ కల్యాణ్‌ చదివేస్తున్నట్లు తెలుస్తోంది.

జనసేన బలంగా ఉన్న స్థానాలకు చంద్రబాబు తన పార్టీ అభ్యర్థులను ప్రకటించి, జనసేన బలహీనంగా ఉన్న స్థానాలను ఆ పార్టీకి కేటాయిస్తున్నట్లు స్పష్టంగానే తెలిసిపోతోంది. అనకాపల్లి శాసనసభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేనకు కేవలం 11,988 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ సీటును పవన్‌ కల్యాణ్‌ తమ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ కోసం తీసుకున్నారు. కొణతాల రామకృష్ణ ఆశించిన అనకాపల్లి పార్లమెంటు సీటును తన సోదరుడు నాగబాబుకు కేటాయించడానికి రామకృష్ణను అసెంబ్లీ బరిలోకి దింపుతున్నారు.

పి. గన్నవరంలో గత ఎన్నికల్లో జనసేనకు 36,759 ఓట్లు వచ్చాయి. అయితే, ఆ సీటును చంద్రబాబు తన పార్టీ అభ్యర్థికి ఇచ్చేశారు. అది కూడా జనసేనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్‌కు ఈ సీటును కేటాయించారు. దీంతో జనసేన కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. విజయవాడ తూర్పులో జనసేన అభ్యర్థికి 30,137 ఓట్లు వచ్చాయి. విజయవాడ సెంట్రల్‌లో జనసేనతో పొత్తు పెట్టుకున్న సిపిఎం అభ్యర్థికి 29,333 ఓట్లు వచ్చాయి. ఈ రెండు స్థానాలు కూడా టీడీపీ జాబితాలోకి వెళ్లాయి.

గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్‌ నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌కు 42,685 ఓట్లు వచ్చాయి. ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. అయితే, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆ సీటును కేటాయించడానికి కందుల దుర్గేష్‌కు నిడదవోలు పంపించడానికి ఏర్పాట్లు చేశారు. నిడదవోలులో గత ఎన్నికల్లో జనసేనకు 23 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

తణుకు శాసనసభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 31,961 ఓట్లు వచ్చాయి. అయితే, ఈసారి ఆ సీటును టీడీపీ తీసుకుంది. జనసేనకు 35,833 ఓట్లు వచ్చిన కొత్తపేట, 35,173 ఓట్లు వచ్చిన మండపేట, 33,334 ఓట్లు వచ్చిన ముమ్మిడివరం, 32,984 ఓట్లు వచ్చిన పాలకొల్లు నియోజకవర్గాలకు కూడా చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు.

దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనివల్ల టీడీపీకి ఓట్ల బదిలీ జరుగుతుందా అనేది అనుమానంగానే ఉంది. దీనివల్ల జనసేనకు కేటాయించిన స్థానాలను ఆ పార్టీ, జనసేన బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ చాలా స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉంది.

Tags:    
Advertisement

Similar News