నోరుజారిన పవన్.. రోజు వ్యవధిలోనే దిద్దుబాటు చర్యలు!

చంద్రబాబు కోసం ఎన్డీఏ నుంచి కూడా జనసేన బయటికి వచ్చేసిందంటూ సెటైర్లు వేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి ముదినేపల్లి సభలో వివరణ ఇచ్చుకుంటూ దిద్దుబాటు చర్యలకు దిగారు.

Advertisement
Update:2023-10-06 09:33 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెడన సభలో నోరుజారి.. రోజు వ్యవధిలోనే దిద్దుబాటు చర్యలకు దిగారు. వారాహి యాత్రలో భాగంగా అతను బుధవారం రాత్రి పెడనలో మాట్లాడుతూ టీడీపీ బలహీన పరిస్థితుల్లో ఉండటంతో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అధికార వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కౌంటర్లు వచ్చాయి. రాష్ట్రంలో టీడీపీ బలహీనపడిపోయిందని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తున్నట్లు ప్రచారం చేసింది. అలానే చంద్రబాబు కోసం ఎన్డీఏ నుంచి కూడా జనసేన బయటికి వచ్చేసిందంటూ సెటైర్లు వేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి ముదినేపల్లి సభలో వివరణ ఇచ్చుకుంటూ దిద్దుబాటు చర్యలకు దిగారు.

ఎందుకు అంత తొందర?

ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానని నేను చెప్పలేదు.. అయినా ఎందుకు వైసీపీకి అంత తొందర? ఒకవేళ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేస్తే..? నేనే చెప్తాను అంటూ పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసి ఏపీలో పరిస్థితిని వివరించి వారి మద్దతు కూడా కోరతానని చెప్పుకొచ్చారు. దాంతో రాబోవు ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? లేదా టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఉంటాయా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

టీడీపీ నుంచి పవన్‌కి సూచనలు..?

వాస్తవానికి పెడన సభలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా టీడీపీ కోసమే ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చానని చెప్పారు. కానీ, ఈ క్రమంలో టీడీపీ బలహీనంగా ఉందని చెప్పడం వైసీపీకి ప్రధాన అస్త్రంగా మారిపోయింది. పార్టీలోని సీనియర్ నేతలు రాబోవు ఎన్నికల్లో బలహీనంగా ఉన్న టీడీపీకి బలమైన జనసేన పార్టీ ఎన్ని సీట్లు ఇవ్వబోతోంది? అని సెటైరికల్‌గా ప్రశ్నలు వేయడంతో టీడీపీ నేతల నుంచి దిద్దుబాటు సూచనలు పవన్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో రోజు వ్యవధిలోనే అతని స్వరం మారిపోయింది.

తిట్టిన నోటితోనే మద్దతు

పవన్ కళ్యాణ్‌ది మొదటి నుంచి నిలకడలేని మనస్తత్వం. 2014లో చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తూ మద్దతిచ్చారు. కానీ.. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, నారా లోకేష్ అవినీతి పరులని.. నా తల్లిని దూషించారని ఇకపై జీవితంలో వారిని క్షమించనంటూ ఎన్నికలకి వెళ్లారు. కానీ.. టీడీపీతో పాటు జనసేనకి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు మళ్లీ స్వ‌రం మార్చి టీడీపీతో పొత్తు పెట్టుకుని బాబుకి మద్దతిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News