శుభాకాంక్షలు చెప్పి మరీ తిట్టించుకున్న పవన్
మహిళలకు అండగా నిలబడతా, వారికి రక్షణ ఇస్తానంటూ పవన్ సందేశాన్నివ్వడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
ఈరోజు మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా నాయకులంతా సోషల్ మీడియా ద్వారా మహిళామణులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలకు మాత్రం తిట్లు బహుమానాలయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి శుభాకాంక్షలు చెప్పడం హాస్యాస్పదం అంటూ కౌంటర్లిస్తున్నారు.
వివాహ వ్యవస్థకే మాయని మచ్చలాంటి వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ ఇటీవల సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కార్లు మార్చినట్టు ఆయన భార్యల్ని మారుస్తారని విమర్శించారు. జగన్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో పవన్ పై చాలామంది ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన మహిళా దినోత్సవం రోజున శుభాకాంక్షలు చెప్పడాన్ని దుయ్యబడుతున్నారు. కట్టుకున్న భార్యల్ని గౌరవించలేని పవన్ మహిళలకు శుభాకాంక్షలు చెబుతూ వారి సంక్షేమం కోసం పాటుపడతానంటూ మెసేజ్ లు పెట్టడం విడ్డూరం అంటున్నారు.
పవన్ కు ఇలాంటి కౌంటర్లు కొత్త కాదు, ప్రతి ఏడాదీ ఆయనకు ఇలాంటి జవాబులు వస్తుంటాయి. ఈ ఏడాది కూడా పవన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు, పనిలో పనిగా సీఎం జగన్ పై పరోక్షంగా తన అక్కసు వెళ్లగక్కారు. నా అక్కలు నా చెల్లెమ్మలు.. అంటూ నాలుక చివరి మాటలతో సరిపుచ్చబోనని.. మహిళలు విద్య, ఉద్యోగాల్లో రాణించేలా చేస్తామని మాటిచ్చారు పవన్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేలా చేస్తామన్నారు. ప్రతి ఆడపడుచుకీ రక్షణ ఇస్తామని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. మహిళల రక్షణ, సంక్షేమం తమ బాధ్యత అన్నారు పవన్.
మహిళలకు అండగా నిలబడతా, వారికి రక్షణ ఇస్తానంటూ పవన్ సందేశాన్నివ్వడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. మహిళలను గౌరవించడం పవన్ కు చేతకాదని కౌంటర్లిస్తున్నారు నెటిజన్లు.