‘వార్’కి సిద్ధమైన పవన్.. ఈనెల 24న ‘వారాహి’కి పూజలు

Pawan Kalyan's Varahi Vehicle: 32 నారసింహ క్షేత్రాలను దర్శించే అనుష్టుమ్ నారసింహ యాత్రను కూడా పవన్ కల్యాణ్ ఈనెల 24న మొదలు పెడతారు. కొండగట్టు ఆంజనేయ స్వామి పూజల అనంతరం ఆయన.. ధర్మపురిలోని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు.

Advertisement
Update:2023-01-16 16:46 IST

రాజకీయ ప్రచార కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా వారాహి అనే వాహనం సిద్ధం చేసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ వాహనానికి పూజలు చేయించేందుకు కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రాబోతున్నారు. ఈనెల 24న కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేస్తారు. వాహన పూజ కూడా చేయించిన అనంతరం ఆయన వారాహితో ఎన్నికల సమరానికి సిద్ధమవుతారు. ఈమేరకు జనసేన పార్టీ తరపున ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.


2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం తరపున ప్రచారంలో పాల్గొన్నప్పుడు కరెంటు తీగలు తగలడంతో పవన్ కల్యాణ్ ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆయన తృటిలో పెద్ద ప్రమాదం తప్పించుకుని కోలుకున్నారు. అప్పటినుంచి ఆయనకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేకంగా మారింది. పార్టీ కార్యక్రమాలయినా, వ్యక్తిగత కార్యక్రమాలయినా పవన్ కల్యాణ్ కొండగట్టుకి వచ్చి పూజలు చేశాకే ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో వారాహి వాహనానికి కూడా అక్కడే పూజలు చేస్తారని గతంలోనే జనసేన వర్గాలు ప్రకటించాయి. అయితే ఇప్పుడు మహూర్తం ఖరారు చేశారు. ఈనెల 24న పవన్ కరీంనగర్ కు వస్తున్నారు.

అనుష్టుమ్ నారసింహ యాత్ర..

32 నారసింహ క్షేత్రాలను దర్శించే అనుష్టుమ్ నారసింహ యాత్రను కూడా పవన్ కల్యాణ్ ఈనెల 24న మొదలు పెడతారు. కొండగట్టు ఆంజనేయ స్వామి పూజల అనంతరం ఆయన.. ధర్మపురిలోని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు. అదే క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాల దర్శనానికి బయలుదేరి వెళ్తారు.

Tags:    
Advertisement

Similar News