పులివెందులలో జగన్ ఇంటిమీద నుంచి హైవేవేస్తా- పవన్
ఇప్పుడున్న రోడ్లపై గుంతలు పూడ్చలేని ప్రభుత్వం, సరిగ్గా కొత్త రోడ్లు వేయలేని ప్రభుత్వం, ఇప్పటంలో రోడ్లను విస్తరిస్తుందంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. విస్తరణ పేరుతో ఇళ్లను తొలగించడం దారుణం అన్నారు పవన్ కల్యాణ్
ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణకోసం కొంతమంది ఇళ్లను తొలగించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈరోజు ఇప్పటంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మా మట్టిని కూల్చారు, మీ కూల్చివేత తథ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న రోడ్లపై గుంతలు పూడ్చలేని ప్రభుత్వం, సరిగ్గా కొత్త రోడ్లు వేయలేని ప్రభుత్వం, ఇప్పటంలో రోడ్లను విస్తరిస్తుందంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. విస్తరణ పేరుతో ఇళ్లను తొలగించడం దారుణం అన్నారు.
పోలీసులపై సానుభూతి..
అత్యాచారాలు చేస్తున్న వారిని పోలీసులు వదిలేస్తున్నారని, కూల్చివేస్తున్న వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని.. అన్నారు పవన్ కల్యాణ్. అయితే పోలీసుల కష్టాలు తమకు తెలుసని, వారిని సోదరులుగానే భావిస్తామని చెప్పారు. పోలీసులు అడ్డుకున్నా జనసైనికులు మౌనంగా ముందుకెళ్లాలని, పోలీసులను ఏమీ అనొద్దని, చేతులు కట్టుకొని ముందుకు నడవాలని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని, దేనికైనా సిద్ధమైనన్నారు పవన్ కల్యాణ్.
ఇడుపులపాయలో హైవే వేస్తాం జాగ్రత్త...
ఇప్పటం గ్రామస్తులు తమ సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే వారిపై ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్. బాధితుల ఇళ్లను పరిశీలించి వారిని పరామర్శించిన అనంతరం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అన్యాయాన్ని ఇక చూస్తూ ఊరుకోలేమని, నలుగురు కిరాయి మూకలు ఉంటే భయపడతామా అని ప్రశ్నించారు. ఎంత మంది ఎన్ని రెక్కీలు నిర్వహించినా ఏం జరగదని, ఎక్కడ ఎవరికి ఏం జరిగినా పూర్తి బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డిదేనని చెప్పారు. ఆయనే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకాణిలో రోడ్ల విస్తరణ ఎందుకు చేపట్టడంలేన్నారు. ఇలాగే ప్రవర్తిస్తే తాము అధికారంలోకి వచ్చాక ఇడుపుల పాయలో హైవే వేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు.