పవన్ టార్గెట్ విశాఖ.. వారాహి పార్ట్-3 అక్కడ్నుంచే
పవన్ కల్యాణ్ కి మాత్రం గాజువాకపై ఇంకా ఆశ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన గోదావరి జిల్లాలనుంచి నేరుగా విశాఖ వైపు టర్న్ తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు.
గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర మొదలు పెట్టిన పవన్ కల్యాణ్ రెండు విడతలు పూర్తి చేశారు. మూడో విడత యాత్రకోసం ఆయన విశాఖను ఎంపిక చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి వారాహి యాత్ర పార్ట్-3 మొదలవుతుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈమేరకు విశాఖ జిల్లా నాయకులతో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. వారాహి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గాజువాకపై ఆశలు సజీవం..
పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రెండు నియోజకవర్గాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఇటీవల ఆయన గోదావరి జిల్లాలపై పూర్తిగా ఫోకస్ పెట్టడంతో మరోసారి ఆయన భీమవరంకు ఫిక్స్ అవుతారని అనుకున్నారంతా, గాజువాకను దాదాపుగా మరచిపోయినట్టే అని తేల్చేశారు. కానీ పవన్ కి మాత్రం గాజువాకపై ఇంకా ఆశ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన గోదావరి జిల్లాలనుంచి నేరుగా విశాఖ వైపు టర్న్ తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు.
త్వరలో షెడ్యూల్ ఖరారు..
వారాహి యాత్రకు సంబంధించి త్వరలో షెడ్యూల్ ఖరారవుతుంది. అయితే యాత్ర మొదలయ్యేది మాత్రం విశాఖ నగరం నుంచే అని ఫైనల్ చేశారు నాదెండ్ల మనోహర్. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగిందని, అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలని జనసైనికులకు పిలుపునిచ్చారు నాదెండ్ల. వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలన్నారు. యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం విశాఖలో ఉంటుందని, ప్రజల సమస్యలు తెలుసుకున్న అనంతరం యాత్ర మొదలవుతుందని చెప్పారు.