నేడు విశాఖలో వారాహి.. పవన్ అన్నిటికీ బదులిచ్చేస్తారా..?
మంత్రులు, మాజీ మంత్రులు కూడా చిరంజీవి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నాగబాబు ట్విట్టర్లో మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ పరిణామాలన్నిటిపై పవన్ కల్యాణ్ కూడా అదే స్థాయిలో స్పందించే అవకాశముంది.
పవన్ కల్యాణ్ వారాహి పార్ట్-3 నేడు విశాఖలో ప్రారంభమవుతుంది. సాయంత్రం విశాఖ జగదాంబ సెంటర్లో పవన్ బహిరంగ సభ ఉంటుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇటీవల జరిగిన పరిణామాలతో పవన్ సభపై అంచనాలు పెరిగాయి. ఈ సభలో ఆయన వాడి వేడి వ్యాఖ్యలు చేసే అవకాశముంది. దీంతో రాజకీయ వర్గాల్లో కూడా సాయంత్రం పవన్ సభపై ఆసక్తి నెలకొంది.
బ్రో సినిమా వివాదం తర్వాత మంత్రి అంబటి రాంబాబు ఎన్నిసార్లు కౌంటర్లిచ్చినా పవన్ కల్యాణ్ స్పందించలేదు. అదే సమయంలో చిరంజీవి మాత్రం అనుకోకుండా స్పందించి బుక్కయ్యారు. దీంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, వైసీపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నేరుగా మంత్రులు, మాజీ మంత్రులు కూడా చిరంజీవి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నాగబాబు ట్విట్టర్లో మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ పరిణామాలన్నిటిపై పవన్ కల్యాణ్ కూడా అదే స్థాయిలో స్పందించే అవకాశముంది.
గతంలో రెండుసార్లు పవన్ వారాహి యాత్ర చేసినప్పుడు పూర్తిగా గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు. స్థానిక ఎమ్మెల్యేలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. బైబై వైసీపీ అనే స్లోగన్ ఇచ్చారు, ఆ పార్టీని గోదావరి నుంచి తరిమేద్దామన్నారు. అనుకోకుండా వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు వారాహి పార్ట్-3 అంతకంటే ఎక్కువ సంచలనాలకు వేదిక అయ్యే అవకాశముంది. చిరంజీవి వ్యాఖ్యలకు వైసీపీ ఇచ్చిన కౌంటర్లకు పవన్ ఘాటుగా బదులిస్తారని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు స్థానిక సమస్యలు, ఇతర విమర్శలతో ప్రసంగం ఉంటుందని అనుకున్నా, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యల తర్వాత ఏపీలో పొలిటికల్ సీన్ మారిపోయింది. అందుకే పవన్ ప్రసంగం కూడా మారిపోయి ఉంటుంది. అటు చంద్రబాబు, పుంగనూరు యాత్ర కూడా వివాదాస్పదంగా మారడంతో, పవన్ ఉత్తరాంధ్ర యాత్రపై పోలీసులు మరింత ఫోకస్ పెట్టారు.