వారాహి దుమ్ము దులుపుతున్న పవన్
ప్రస్తుతం ఏపీలో 2 లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ముందుగా ఆయా నియోజకవర్గాల్లో పవన్ వారాహి పరుగులు తీస్తుంది.
ఆమధ్య వారాహి వాహనం ఎక్కి హడావిడి చేసిన పవన్ కల్యాణ్, ఆ తర్వాత దాన్ని షెడ్డుకి పంపించి, తాను పొత్తుల వేటలో మునిగిపోయారు. తీరా ఇప్పుడు పంపకాలు పూర్తయ్యాక మళ్లీ వారాహిని బయటకు తీయబోతున్నారు. ఈనెల 17నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార బరిలో దిగబోతున్నట్టు తెలుస్తోంది. వారాహి ఎక్కి ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటన చేపడతారని పార్టీ వర్గాలంటున్నాయి.
సీఎం జగన్ ఇప్పటికే సిద్ధంతో హోరెత్తించారు, మేమంతా సిద్ధం అంటూ బస్సుయాత్రకు కూడా రెడీ అయ్యారు. అటు చంద్రబాబు కూడా యాత్రలు మొదలు పెడుతున్నారు. జనసేనాని మరీ పిఠాపురానికి పరిమితమైపోతే ఆయన ఇమేజ్ డ్యామేజీ అవుతుంది. అందుకే పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన అంటూ వారాహిని బయటకు తీస్తున్నారు. మరోసారి ఆ వాహనం ఎక్కి ఆవేశపూరిత ప్రసంగాలు చేయడానికి రెడీ అయ్యారు.
జనసేన స్థానాలపై ఫోకస్..
ప్రస్తుతం ఏపీలో 2 లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ముందుగా ఆయా నియోజకవర్గాల్లో పవన్ వారాహి పరుగులు తీస్తుంది. ఆ తర్వాత కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకోసం పవన్ వారాహి ఎక్కుతారు. టీడీపీ తరపున బరిలో ఉన్న కాపు నాయకులకు మద్దతుగా కూడా పవన్ కల్యాణ్ యాత్ర చేపడతారని అంటున్నారు. తొలి విడత వారాహి కేవలం విమర్శలకే సరిపోయింది, పవన్ పై లెక్కలేనన్ని ప్రతి విమర్శలను తెచ్చిపెట్టింది. మరి సెకండ్ సీజన్ ఎలా నడుస్తుందో చూడాలి.