మోదీ పోయిన మూడు రోజులకి ట్వీట్లెందుకు పవన్..
ఆరోజు జరిగిన మీటింగ్ గురించి పవన్ కల్యాణ్ ఈరోజు ట్వీట్ వేశారు. మోదీకి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. ఆయన పురోగమన శీలి అని, క్లిష్ట సమయంలో పాలన చేపట్టి దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు.
ఈనెల 11న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీని, జనసేనాని పవన్ కల్యాణ్ కలిశారు. ఆయన మీటింగ్ తర్వాత వెంటనే హోటల్ బయట ప్రెస్ మీట్ పెట్టారు. చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఆయన మొహంలో మెరుపు, హుషారు ఏమాత్రం లేదనే వైసీపీ విమర్శలను ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అయితే ఆ భేటీ తర్వాత వెంటనే మోదీ-పవన్ ఫొటోలు బయటకు రాలేదు. జనసేన ట్విట్టర్ హ్యాండిల్ కానీ, మిగతా ప్రధాన మీడియాలకు కూడా ఆ ఫొటోలు విడుదల కాలేదు. అసలు లోపల ఎవరెవరు ప్రధానిని కలిశారనే విషయాలు కూడా తెలియరాలేదు. ఆ తర్వాత ఫొటోలు బయటకొచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు పవన్ ఆ ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ముచ్చట ఇప్పుడెందుకంటూ వైసీపీ నుంచి మళ్లీ సెటైర్లు పడ్డాయి.
మోదీ గట్టిగానే క్లాస్ తీసుకున్నారా..?
చంద్రబాబుతో అంటకాగుతున్న పవన్ కి ప్రధాని మోదీ గట్టిగానే క్లాస్ తీసుకున్నారని, అందుకే ఆయన హోటల్ బయట నీరసంగా మాట్లాడి వెళ్లిపోయారనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. ఆ సంగతి పక్కనపెడితే, ఇటీవల జగనన్న ఇళ్ల దగ్గర పరామర్శలకు వెళ్లిన పవన్, వైసీపీ నేతలు చిన్న పిల్లల్లా ఢిల్లీ వెళ్లి మరీ తనపై మోదీకి కంప్లయింట్ లు చేశారని చెప్పుకొచ్చారు. అంటే ఆరోజు మోదీ, పవన్ భేటీలో లోపల ఏదో జరిగిందనే విషయం మాత్రం జనాలకు అర్థమైంది. వైసీపీ ఫిర్యాదులని పరిగణలోకి తీసుకుని పవన్ ని మోదీ ఏమైనా అన్నారా, టీడీపీ విషయంలో సీరియస్ అయ్యారా, అందుకే ఆయన బయటకొచ్చి పొడిపొడిగా మాట్లాడి వెళ్లిపోయారా అనేది తేలాల్సి ఉంది.
ఆ విషయం పక్కనపెడితే ఆరోజు జరిగిన మీటింగ్ గురించి పవన్ కల్యాణ్ ఈరోజు ట్వీట్ వేశారు. మోదీకి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. ఆయన పురోగమన శీలి అని, క్లిష్ట సమయంలో పాలన చేపట్టి- ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు.. అన్నింటినీ అర్థం చేసుకొని సమాదరించి ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావన నింపారని గొప్పలు చెప్పారు. వాస్తవానికి మోదీని మరీ ఇంతలా పవ న్ కల్యాణ్ మోయాల్సిన అవసరం లేదు. అది కూడా ఆ ముచ్చట జరిగిన మూడు రోజుల తర్వాత. అందుకే ఎక్కడో తేడా కొట్టిందంటూ మళ్లీ వైసీపీ నుంచి సెటైర్లు మొదలయ్యాయి. ప్రధాని ఫొటోలను ప్రచారం చేసుకుంటూ పవన్ ఆయనపై ఎక్కడలేని గౌరవం, అభిమానం చూపిస్తున్నారని, చంద్రబాబు పేరెత్తకుండా పవన్ కి మోదీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టున్నారని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఈ లేటు పోస్టింగ్ లపై, దానికి వైసీపీ కౌంటర్లపై పవన్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.