గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం.. పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్
గతంలో ఏళ్లతరబడి నిర్లక్ష్యానికి గురైన పంచాయతీల సాధికారతకు ఇప్పుడు తొలి అడుగు పడిందని అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్.
స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఏమాత్రం నిధులు ఇస్తుందో తెలుసా..?
మైనర్ పంచాయతీకి కేవలం రూ.100
మేజర్ పంచాయతీకి కేవలం రూ.250
34 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ బడ్జెట్ ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతోంది. అంటే ఈ 100 రూపాయలతోనే జెండా దిమ్మెను అలంకరించాలి, పూలు కొనాలి, చాక్లెట్లు కొనాలి, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించాలి, విజేతలకు బహుమతులు ఇవ్వాలి. వీటన్నిటికీ రెవెన్యూ, ఇతర ఉద్యోగులు తమ చేతి ఖర్చులు పెట్టుకుంటారు. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేవని అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆ నిధుల్ని తమ ప్రభుత్వం గణనీయంగా పెంచిందని చెబుతున్నారు.
ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెంచిన నిధులు పంచాయతీలకు కేటాయించబోతున్నట్టు చెప్పారు పవన్ కల్యాణ్. మైనర్ పంచాయతీలకు రూ.10వేలు, మేజర్ పంచాయతీలకు రూ.25వేలు నిధులు కేటాయిస్తామన్నారు. గతంలో ఏళ్లతరబడి నిర్లక్ష్యానికి గురైన పంచాయతీల సాధికారతకు ఇప్పుడు తొలి అడుగు పడిందని అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీలకు ఇచ్చే నిధులు పెంచామని చెబుతూ పవన్ కల్యాణ్ ట్వీట్ వేశారు. పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చే దిశగా తొలి అడుగు వేశామని ఆయన అన్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయకత్వంలో పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలను అప్పగించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు పవన్.