14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన
జనం మధ్యకు వచ్చేందుకు ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. 14వ తేదీ నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
ఏపీలో ఎన్నికలకు పట్టుమని రెండు నెలల సమయం కూడా లేదు. అధికారంలో ఉన్న సీఎం జగన్ 'సిద్ధం' పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా 'రా కదిలిరా' పేరుతో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ ఏపీలో సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీలు. అయినప్పటికీ ఆ రెండు పార్టీలు జనంలోకి బలంగా వెళుతున్నాయి. కానీ, సంస్థాగతంగా ఎటువంటి నిర్మాణం లేని జనసేన మాత్రం ఇప్పటిదాకా జనంలోకి వెళ్లలేదు.
ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ కోట్లు ఖర్చుపెట్టి వారాహి రథాన్ని సిద్ధం చేసి కూడా దానిని బయటకు తీయడం లేదు. వారాహి వాహనం బయటికి వచ్చేది ఇంకెప్పుడూ అంటూ పార్టీ శ్రేణులే వాపోతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు జనం మధ్యకు వచ్చేందుకు ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. 14వ తేదీ నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ పర్యటనను షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పాల్గొననున్నారు. మిగిలిన రెండు రోజుల్లో అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో పవన్ పర్యటించనున్నారు. పవన్ కళ్యాణ్ తన పర్యటనలో భాగంగా ప్రచార సభలు నిర్వహించడం లేదు. కేవలం పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ కానున్నారు.
పవన్ పర్యటనలను మూడు దశలుగా నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. మొదటి దశలో ఆయన ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. రెండోసారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీలు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశాలు నిర్వహిస్తారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి పవన్ కళ్యాణ్ మూడుసార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు.