రెండున్నరేళ్ల క్రితమే ఆ ప్రపోజల్ వచ్చింది.. పిఠాపురంలో పవన్

రెండున్నరేళ్ల క్రితమే తనను ఇక్కడకు రావాలని స్థానిక నేతలు ఆహ్వానించారని అన్నారు పవన్. పిఠాపురంలో ఈసారి విజయకేతనం ఎగుర వేస్తామన్నారు.

Advertisement
Update:2024-04-09 18:03 IST

గాజువాక అన్నారు, భీమవరం అన్నారు.. ఓడిపోయినా మీతోటే, మీవెంటే అని ఆ రెండు నియోజకవర్గాల ప్రజలకు చెబుతూ వచ్చారు. అలాంటి పవన్ చివరకు పిఠాపురం ఫిక్స్ అయ్యారు. అలా ఫిక్స్ అయిన తర్వాత కూడా కాకినాడ ఎంపీ సీటా, పిఠాపురం ఎమ్మెల్యే సీటా అనే తర్జన భర్జన ఉంది. అయితే పవన్ మాత్రం పిఠాపురంను హడావిడిగా సెలక్ట్ చేసుకోలేదని, పక్కా ప్లాన్ ప్రకారమే అక్కడకు వచ్చారని తెలుస్తోంది. రెండున్నరేళ్ల క్రితమే తనను ఇక్కడకు రావాలని స్థానిక నేతలు ఆహ్వానించారని అన్నారు పవన్. పిఠాపురంలో ఈసారి విజయకేతనం ఎగుర వేస్తామన్నారు. కూటమి గెలుపు ఇక్కడినుంచే మొదలవుతుందన్నారు పవన్.

వర్మ సైలెంట్ అయినట్టేనా..?

ఓ దశలో పిఠాపురం సీటు విషయం హాట్ హాట్ గా మారింది. టీడీపీ నేత వర్మ తనకే ఆ సీటు కావాలని పట్టుబట్టారు, అనుచరులతో కలసి రచ్చరచ్చ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ హామీతో ఆయన మెత్తబడినట్టు కనిపించారు. ఇప్పుడు పవన్ తో పూర్తిగా ప్యాచప్ అయిపోయారు వర్మ. పవన్ కూడా ఆయనకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. పిఠాపురంలో జరిగిన ఉగాది వేడుకల్లో కూడా వర్మను పక్కనే ఉంచుకున్నారు. అందరి మద్దతుతో తన గెలుపు గ్యారెంటీ అన్నారు పవన్. క్రోధి నామ సంవత్సరంలో ప్రజలకు మేలు జరగాలని, రైతులు, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు పవన్.

చేబ్రోలుకు వచ్చిన పవన్ తో టీడీపీ నేత రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఉండి సీటు విషయంలో ఆయన సూటిగా స్పందించలేదు కానీ.. తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్‌ తన తరపున ప్రచారం చేస్తారని చెప్పారు. జగన్‌ వచ్చి కూర్చున్నా పిఠాపురంలో జనసేనానికి 65వేల ఓట్ల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రఘురామ కృష్ణంరాజు.

Tags:    
Advertisement

Similar News