సినిమాలు మానేయడానికి నేను రెడీ.. కానీ..!
తన ప్రయారిటీ ఒక్కటేనని, జగన్ ఇంకోసారి సీఎం కాకూడదని చెప్పారు పవన్. ఒక్కసారి ప్రజలు అవకాశమిచ్చారని, భుజానికెక్కించుకున్నారని, కానీ జగన్ దెయ్యమై రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నారని, ఇంకోసారి మాత్రం ఆయన రాకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు.
సినిమాలు మానేయడానికి తాను రెడీ అని, కానీ పార్టీ నడపడానికి అదే ఇంధనంగా ఉందని, అందుకే మానేయలేకపోతున్నానని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. గాజువాక నియోజకవర్గంలో జరిగిన సభలో వైసీపీపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్టార్ డమ్ తాను కోరుకుంటే రాలేదని, అలాగే సీఎం పదవి కూడా తాను పనిచేసుకుంటూ వెళ్లి సాధిస్తానని అన్నారు. సీఎం కావడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని, అయితే అది కాలానికే వదిలేద్దామన్నారు. పదేళ్ల తర్వాత తాను ఈరోజు అడుగుతున్నానని, సీఎం పదవి స్వీకరించడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని చెప్పారు పవన్.
జగన్ రాకూడదు..
తన ప్రయారిటీ ఒక్కటేనని, జగన్ ఇంకోసారి సీఎం కాకూడదని చెప్పారు పవన్. ఒక్కసారి ప్రజలు అవకాశమిచ్చారని, భుజానికెక్కించుకున్నారని, కానీ జగన్ దెయ్యమై రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నారని, ఇంకోసారి మాత్రం ఆయన రాకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ దుర్మార్గుడని, సైకో అని, పచ్చని రుషి కొండని తొలిచేస్తున్నారని మండిపడ్డారు పవన్. రుషికొండ మట్టిని ముద్దలుగా చేసి, వారికి తినిపించాలన్నారు.
ఆయన ఓ రౌడీ..
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్. ఒక రౌడీషీటర్ ను వైజాగ్ ఎంపీగా గెలిపించారని.. అటువంటి ఎంపీ ప్రధాని దగ్గరకు వెళ్లి స్టీల్ ప్లాంట్ ను కాపాడగలరా అని ప్రశ్నించారు. ఆంధ్రా ఎంపీలంటే దోపిడీదారులనే అభిప్రాయం ఢిల్లీ పెద్దల్లో ఉందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాను ఢిల్లీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తానని.. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, పార్టీలు కలిసి వస్తే ఐరన్ ఓర్ సొంత గనులు కేటాయించే వరకు బాధ్యత తీసుకుంటానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో కోపం, వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. తాను వాస్తవాలు మాట్లాడితే గయ్యాళుల్లాగా నోరు వేసుకుని వైసీపీ నాయకులు తనపై పడిపోతున్నారని ఎద్దేవా చేశారు పవన్.
గాజువాక మనదే..
తనను ఓడించినా కూడా తాను గాజువాకను మరచిపోలేదని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. ఈసారి గాజువాకలో జనసేన జెండా ఎగిరి తీరుతుందన్నారు. పోరాటం ఎలా చేయాలో ఉత్తరాంధ్ర తనకు నేర్పించిందన్నారు. గాజువాకలో తనకు ఇంత ఆదరణ వస్తుందని, తన సభకు ఇంతమంది వస్తారని ఊహించలేదన్నారు పవన్.