ఎమ్మెల్యేలు, మంత్రులు ఇబ్బంది పెడితే మాతో చెప్పండి
గత ప్రభుత్వంలో లాగా ఎమ్మెల్యేలు, మంత్రులతో ఐఏఎస్, ఐపీఎస్ లకు ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
వైసీపీ ప్రభుత్వం కలెక్టర్ల వ్యవస్థని ఆటబొమ్మగా చేసిందని విమర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వ్యవస్థలపై దాడుల్ని అరికట్టే ఉద్దేశంతోనే తాము అధికారంలోకి వచ్చామని చెప్పారాయన. 93 శాతం స్ట్రైక్ రేట్ తో తమ కూటమి ఏపీలో అధికారం చేపట్టిందని, ప్రజలకు జవాబుదారీగా ఉంటామని చెప్పారాయన. గతంలో ఎప్పుడూ ఏపీ ఇంతటి ఇబ్బందుల్ని ఎదుర్కోలేదన్నారు పవన్. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఏపీలో పని చేసేందుకు పోటీపడేవారని, కానీ గత ఐదేళ్లలో విధ్వంసం జరిగిందన్నారు. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో చెప్పిన ఏపీ, గత ఐదేళ్లలో ఓ రాష్ట్రం ఎలా ఉండకూడదో చెప్పిందని, దానికి కారణం గత వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్, గత ప్రభుత్వంలో నాశనమైన వ్యవస్థలను తిరిగి గాడిలో పెడతామన్నారు.
గత ప్రభుత్వంలో తమపై వ్యక్తిగతంగా దాడులు చేశారని, తిట్టినా భరించామని, కుటుంబ సభ్యులపై దాడులు చేసినా సహించి ప్రజల కోసం పోరాటం చేశామని చివరికి విజయం సాధించామన్నారు పవన్ కల్యాణ్. అదే సమయంలో అధికారుల్ని కూడా ఇబ్బంది పెట్టారన్నారు. పరిపాలనా దక్షత, పాలనా అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు సారథ్యంలో అన్నీ చక్కదిద్దుతామని చెప్పారు పవన్.
గత ప్రభుత్వంలో లాగా ఎమ్మెల్యేలు, మంత్రులతో ఐఏఎస్, ఐపీఎస్ లకు ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వారెవరూ అధికారుల్ని ఇబ్బంది పెట్టరని చెప్పారు. ఎవరైనా ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. అధికారులు స్వేచ్ఛను తాము గౌరవిస్తామని చెప్పారు పవన్. ఇప్పటికే అనేక ఇబ్బందులు పడ్డామని, రాష్ట్ర విభజనతోనూ కష్టాలు పడ్డామని, ఇకపై అలా ఉండకూడదని దిశా నిర్దేశం చేశారు పవన్.