ప్రభుత్వంపై బండలేసిన పవన్.. ఏలూరులో తీవ్ర వ్యాఖ్యలు
సమాచారమంతా వాలంటీర్ల ద్వారా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని, తద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు పవన్. అంతమంది ఉసురు జగన్ పోసుకుంటున్నారని మండిపడ్డారు.
వారాహి పార్ట్-2 కూడా వాడి వేడిగానే మొదలైంది. ఏలూరులో జరిగిన తొలి బహిరంగ సభలో ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. సీఎం జగన్ కి సభ్యత లేదని, రాజకీయాలతో సంబంధం లేని తన భార్య గురించి ఆయన మాట్లాడుతున్నారని, అందుకే ఇకపై తాను ఆయన్ను ఏకవచనంతో సంబోధిస్తానన్నారు. చెవులు రిక్కించి విను జగన్ అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.
ఏపీలో రూ.1.25లక్షల కోట్లు మద్యం ద్వారా ఆదాయం వస్తోందని అందులో 97వేల కోట్లు మాత్రమే ప్రభుత్వానికి వెళ్తోందని, మిగతాదంతా జగన్ జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు పవన్. ఆ సొమ్ముతోనే ఎన్నికల్లో ఓట్లు కొనబోతున్నారని చెప్పారు. జగన్ లా తనకు అడ్డగోలు సంపాదన లేదని, ఆయన నాన్నలా తన నాన్న సీఎం కాదని, ఆయనలాగా ప్రతి పనికీ తనకు 6 శాతం కమీషన్ రాదని చెప్పారు పవన్. కష్టపడి సినిమాల్లో నటించి, వచ్చిన డబ్బుని పేదలకు, కౌలు రైతులకు పంచుతున్నానని అన్నారు పవన్. మంచి చేసేవాడు హైదరాబాద్ లో ఉంటే ఏంటని ప్రశ్నించారు.
ఏపీలో జీవోలు బ్యాన్..
ఇండియా టిక్ టాక్, చైనా ఫేస్ బుక్ బ్యాన్ చేశాయని, ఏపీలో మాత్రం జగన్ జీవోలను బ్యాన్ చేస్తున్నారని, జీవోలను బయటకు కనపడనీయడంలేదని ఎద్దేవా చేశారు పవన్. ప్రజల ముందుకు రావాలంటే ఆయనకు పరదాలే దిక్కు అని చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదని, మీడియా అంటే జగన్ కి భయం అని చెప్పారు.
మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం..
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 30వేలమంది మహిళలు అదృశ్యమయ్యారని, అందులో 14వేలమంది ఆచూకీ ఇంకా దొరకలేదని చెప్పారు పవన్. గ్రామంలో ఎంతమంది మహిళలున్నారు, ఒంటరి మహిళలు ఎంతమంది, వితంతువులు ఎవరు.. అనే సమాచారమంతా వాలంటీర్ల ద్వారా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని, తద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు పవన్. అంతమంది ఉసురు జగన్ పోసుకుంటున్నారని మండిపడ్డారు.
కాగ్ కడిగేసిందిగా..
గతేడాది ప్రభుత్వం చేసిన ఖర్చులపై కాగ్ నివేదికలో అక్రమాలన్నీ బయటపడ్డాయన్నారు పవన్. కాగ్ 25 లోపాలను ఎత్తిచూపిందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి పేరుతో రూ.22,504 కోట్లు అప్పు చేసి లెక్కాపత్రం లేకుండా ప్రభుత్వం దోచేసిందని అన్నారు. రోడ్లు బాగు చేసేందుకు రూ.4,754 కోట్లు తీసుకున్నారని, కానీ ఏపీలో 37,942 ప్రమాదాలు జరిగి 14,230 మంది అమాయకులు చనిపోయారని, దానికి కారణం ఎవరని ప్రశ్నించారు పవన్. కాగ్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతోందని ఎద్దేవా చేశారు.