ఆ బటన్లు నొక్కలేదేం..? పవన్ వెటకారం
పవన్ అంటే ఒక్కరు కాదని, లక్షల మంది ఆడపడుచులు, జనసేన కార్యకర్తలు అని గుర్తు చేశారు. తాను అధికారంలోకి వస్తే బటన్ నొక్కబోనని, వ్యవస్థను కాపాడేందుకు ఓ ముఠామేస్త్రిలా పని చేస్తానన్నారు.
బటన్ నొక్కడం, ఆర్థిక సాయం బ్యాంక్ అకౌంట్లో జమకావడం.. దీని వల్ల ఎక్కడా మధ్యవర్తుల ప్రస్తావన లేకుండా పూర్తి స్థాయిలో ఆ లబ్ధి ప్రజలకు చేరుతుందని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. నేను బటన్ నొక్కుతూ నా పని చేస్తున్నా, మీరు ప్రజల్లోకి వెళ్లి జరుగుతున్న మంచి వివరించండి అని ఎమ్మెల్యేలకు ఉద్బోధ చేస్తుంటారు జగన్. ఈ బటన్ నొక్కడాన్ని కామెడీ చేస్తూ తాజాగా పపన్ కల్యాణ్ నరసాపురం సభలో సెటైర్లు పేల్చారు. జగన నొక్కకుండా వదిలేసిన బటన్లు చాలానే ఉన్నాయన్నారు.
జగన్ నొక్కని బటన్ల లిస్ట్
- పోలవరం ప్రాజెక్ట్ బటన్
- ఉద్యోగాల నోటిఫికేషన్ బటన్
- రైతు పరిహారం బటన్
- దళితులను చంపి బయట తిరుగుతున్న MLC బటన్
- అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ బటన్
- మూతపడిన 8 వేల బడుల బటన్
- త్రాగునీరు దొరకని గ్రామాల బటన్
అంటూ ఓ లిస్ట్ చదివి వినిపించారు పవన్ కల్యాణ్. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించిన బటన్ ని జగన్ ఎందుకు నొక్కడం లేదని ప్రశ్నించారు.
తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జగన్ రౌడీయిజం చేశారని, 21 ఏళ్ల వయసులోనే పులివెందులలో ఒక ఎస్సైని దారుణంగా కొట్టి సెల్‌లో పడేశారని, తండ్రి సీఎం అయ్యాక పైరవీలు మొదలుపెట్టారని విమర్శించారు పవన్. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న గోదావరి జిల్లాల్లో పులివెందుల రౌడీ సంస్కృతిని తీసుకురావాలని చూస్తున్నారని, అలాంటి వారిని తన్ని తగలేస్తామన్నారు.
పవన్ అంటే ఒక్కరు కాదని, లక్షల మంది ఆడపడుచులు, జనసేన కార్యకర్తలు అని గుర్తు చేశారు. తాను అధికారంలోకి వస్తే బటన్ నొక్కబోనని, వ్యవస్థను కాపాడేందుకు ఓ ముఠామేస్త్రిలా పని చేస్తానన్నారు. నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీని మించిన హెల్త్ పాలసీ తీసుకువస్తామని చెప్పారు. పోకిరీలు ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడేలా కఠిన చట్టాలు తీసుకువస్తామని చెప్పారు పవన్.