ఇలా ఇలా ఇలా.. జగన్ కి బదులిచ్చేసిన పవన్
"నేను ఊగిపోతూ మాట్లాడటం మన ముఖ్యమంత్రికి ఇష్టం లేదట, అందుకే ఇక నుంచి నేను ఊగిపోకుండా ఇలా ఇలా ఇలా చేయి ఊపుతూ మాట్లాడతాను" అంటూ సీఎం జగన్ స్టైల్ ని కాసేపు అనుకరించారు పవన్.
అమ్మఒడి కార్యక్రమంలో ఆ మాటలేంటి..? పిల్లలముందు ఆ భాష ఏంటి..? అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు పవన్ కల్యాణ్. కనీసం అఆ లు కూడా రాని వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం అన్నారు. జనసేన వయోజన సంచార పాఠశాల ద్వారా జగన్ కి తెలుగు పదాలు, మాటలు నేర్పుతామని వెటకారం చేశారు. తెలుగు రాదు కాబట్టే జగన్ కి వారాహికి, వరాహికి తేడా తెలియలేదన్నారు. భీమవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇలా.. ఇలా.. ఇలా..
"నేను ఊగిపోతూ మాట్లాడటం మన ముఖ్యమంత్రికి ఇష్టం లేదట, అందుకే ఇక నుంచి నేను ఊగిపోకుండా ఇలా ఇలా ఇలా చేయి ఊపుతూ మాట్లాడతాను" అంటూ సీఎం జగన్ స్టైల్ ని కాసేపు అనుకరించారు పవన్ కల్యాణ్. భీమవరం సభలోనే బదులిద్దామని అనుకున్నాను కానీ, లోపలనుంచి మాటలు తన్నుకొస్తున్నాయని చెప్పారు.
వాటన్నిటికీ భీమవరంలో జవాబిస్తా..
ఈరోజు కురుపాంలో జరిగిన అమ్మఒడి సభలో సీఎం జగన్, పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ వివాహాల గురించి మాట్లాడుతూ నాలుగేళ్లకోసారి మనం భార్యలను మార్చలేం కదా అని అన్నారు జగన్. పవన్ ఊగిపోతూ మాట్లాడతారని కూడా కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి రెండు రోజుల తర్వాత భీమవరం సభలో పవన్ వీటన్నిటికీ బదులు చెబుతారని అనుకున్నారు, కానీ విమర్శల డోసు కాస్త ఎక్కువగా ఉండటంతో జనసేనాని ఈరోజే బదులిచ్చేశారు. తనకు జ్వరంగా ఉందని, మాట్లాడటం కాస్త కష్టంగా ఉందంటూనే జగన్ కి కౌంటర్లిచ్చారు పవన్. ఈ రెండు రోజుల్లో వైసీపీ నేతలు మరిన్ని తప్పులు చేస్తారని, వాటన్నిటికీ భీమవరంలో జవాబిస్తానన్నారు. మొత్తమ్మీద ఏపీ రాజకీయాలు ఇప్పుడు జగన్ వర్సెస్ పవన్ అన్నట్టుగా మారిపోయాయి. ఒకరినొకరు నేరుగా టార్గెట్ చేసుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలు, ఒకరినొకరు ఇమిటేట్ చేసుకోవడంతో.. ఈ ఎపిసోడ్ జనాలకు గొప్ప ఎంటర్టైన్మెంట్ గా మారింది.