పవన్ ఆరోపణలపై వైసీపీనుంచి కౌంటర్లు లేవా..?
జల్ జీవన్ మిషన్ విషయంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేదని పవన్ సమీక్షల్లో అధికారులు స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం పోస్ట్ తోపాటు మంత్రి పవన్ కల్యాణ్ కు ఐదు కీలక శాఖలు లభించాయి. ఆయా శాఖల అధికారులతో సమావేశమై సమీక్షలు చేపడుతున్న జనసేనాని.. ముఖ్యంగా వైసీపీపై పరోక్ష ఆరోపణలు సంధిస్తున్నారు. లెక్కలన్నీ బయటపెట్టిస్తూ, గత ప్రభుత్వం తప్పు చేసిందని అధికారులతోనే నిందలు వేయిస్తున్నారు. వారం రోజులుగా ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది. అయితే వైసీపీ నుంచి మాత్రం ఇంకా కౌంటర్లు మొదలు కాలేదు.
ఇటీవల స్వచ్ఛాంధ్ర మిషన్ నిధులు పక్కదారి పట్టాయని, పవన్ సమీక్షల తర్వాత వార్తలొచ్చాయి. తాజాగా జల్ జీవన్ మిషన్ విషయంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేదని పవన్ సమీక్షల్లో అధికారులు స్పష్టం చేశారు. దీంతో కేంద్రం నిధుల్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదనే విమర్శలు వినపడుతున్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలవరం విషయంలో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. వెంటనే తెరపైకి వచ్చిన నాటి జలవనరుల శాఖ మంత్రి ఆ ప్రాజెక్ట్ తనకే అర్థం కాలేదని చెప్పడంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయింది. ఇక రుషికొండ భవనాల విషయంలో కూడా వైసీపీ ప్రతిదాడి అంత బలంగా లేదు. చంద్రబాబు ఇంటికి హోమ్ టూర్ వేద్దాం, జగన్ ఇంటితో కంపేర్ చేస్తూ రిటైర్డ్ జడ్జ్ తో విచారణ చేపడదాం అంటూ వైసీపీ నుంచి వచ్చిన కౌంటర్లు సబ్జెక్ట్ ని పక్కదారి పట్టించాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూటిగా నిధుల విషయంలో వైసీపీ తప్పులు చేసిందని లెక్కలు బయటపెడుతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టాయని, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ లు విడుదల చేయలేదని అధికారులతోనే చెప్పిస్తున్నారు. ఈ అధికారిక సమాచారంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.