ఈ తీగలను ఏ ఉడతలు కొరికాయి..?
కరెంట్ తీగలను ఉడతలు కొరికాయంటూ నమ్మశక్యం కాని మాటలు చెప్పొద్దని, సమస్యను మరుగున పడేయొద్దని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన పార్టీ తరపున మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
గతంలో సత్యసాయి జిల్లా బుడంపల్లెలో హై టెన్షన్ కరెంటు తీగలు తెగి ఆటోపై పడిన ఘటనలో 8మంది రైతు కూలీలు సజీవ దహనమయ్యారు. ఉడతలు తీగలపైకి ఎక్కడం వల్లే షార్ట్ సర్క్యూట్ తో తీగలు తెగాయంటూ ఏపీ విద్యుత్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. తాజాగా కడప జిల్లాలో కరెంటు వైర్లు తెగిపడి ముగ్గురు రైతులు పొలంలోనే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. అయితే ఇక్కడ కూడా ఉడతలు కొరికాయంటూ నమ్మశక్యం కాని మాటలు చెప్పొద్దని, సమస్యను మరుగున పడేయొద్దని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన పార్టీ తరపున మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
విద్యుత్ షాక్ తో రైతులు మృతి చెందడం దురదృష్టకరం అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు పవన్ కల్యాణ్. విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఉందని క్షేత్ర స్థాయి నుంచి తనకు సమాచారం వచ్చిందని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో లాగా ఉడతలపై నెపం నెట్టి తప్పించుకోవద్దని చెప్పారు.
మోటర్లకు మీటర్లపై పెట్టే శ్రద్ధ..
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడంపై చూపే శ్రద్ధను నాణ్యమైన విద్యుత్ సరఫరాపై పెట్టాలని హితవు పలికారు పవన్ కల్యాణ్. విద్యుత్ తీగలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుని న్యాయబద్ధమైన పరిహారం అందించాలని కోరారు. విశాఖ ఎయిర్ పోర్ట్ ఎపిసోడ్ తర్వాత విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీ నేతలపై విరుచుకు పడిన పవన్ కల్యాణ్, ఆ తర్వాత సినిమా షూటింగ్ లతో బిజీ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆయన ఈ ప్రెస్ నోట్ ద్వారా రాజకీయ విమర్శలు సంధించారు. పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారంటూ సెటైర్లు పేలుస్తున్న వైసీపీ నేతలు ఈ ప్రెస్ నోట్ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.