పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం చంద్రబాబుకి అస్సలు ఇష్టం లేదు. ఆయన వ్యవహారం తెలిసినవారెవరికైనా అర్థమయ్యే విషయం ఇది. అందుకే ఇటీవల పార్లమెంట్ కి పవన్ పోటీ అనే ప్రస్తావన వచ్చింది. ఏకంగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా వస్తుందని ఎల్లో మీడియా కోడై కూసింది. ఆ భ్రమల్లోకి పవన్ ని నెట్టేసి లోక్ సభకు పంపించేసి, ఏపీలో టీడీపీకి తిరుగులేకుండా చేయాలనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం పిఠాపురం అల్లర్లు కూడా దీన్ని రుజువు చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ ని భయపెట్టేందుకే ఈ హడావిడి జరుగుతోందని తెలుస్తోంది.
పిఠాపురం సీటు పవన్ కల్యాణ్ కి ఇస్తే తనకేమాత్రం ఇబ్బంది లేదని వారం రోజుల క్రితం ఇదే వర్మ ఘనంగా మీడియా ముందు చెప్పారు. అసలు పవన్ పిఠాపురం రావాల్సిన అవసరం లేదని, తానే ప్రచారం చేసి విజయాన్ని పవన్ కి బంగారు పళ్లెంలో పెట్టి సమర్పిస్తానని అన్నారు. సీన్ కట్ చేస్తే, నిన్న నానా రచ్చ చేశారు వర్మ. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు. ఇంతలోనే ఆయన మనసు ఎందుకు మారింది..? చంద్రబాబు ప్రోద్బలంతో పవన్ ని భయపెట్టేందుకే ఈ డ్రామా జరిగిందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
2019లో రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కల్యాణ్ కి ఎన్నికలంటే బాగా భయం పట్టుకుంది. అందుకే ఈసారి కూడా ఆయన ఒంటరిపోరుకి నై అన్నారు. పార్టీ భవిష్యత్ కంటే ప్యాకేజీతోనే సంతృప్తి చెంది 21 సీట్లకు పరిమితమయ్యారు. భీమవరం, గాజువాక కాదని, పిఠాపురం సేఫ్ జోన్ అని ఫిక్స్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పాజిటివ్ గా ఉండటంతో పవన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. తీరా ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పార్టీని వదిలి వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పవన్ తీవ్రంగా నష్టపోతారు. పోనీ వర్మ గెలిచినా తర్వాత టీడీపీలోనే చేరతారు. ఆ రకంగా చంద్రబాబుకి ఇక్కడ వచ్చిన ఇబ్బందేమీ లేదు. పవన్ ఓడిపోతేనే బాబు రిలాక్స్ అవుతారు.
లోక్ సభకు పోటీ చేసే విషయంలో తర్జన భర్జన పడుతున్న పవన్, పిఠాపురం సెగలు చూశాక పార్లమెంటే సేఫ్ అని అనుకుంటారేమో. ఆయనలో అలాంటి ఆలోచన తెచ్చేందుకే చంద్రబాబు ఈ వ్యూహం పన్నారనే గుసగుసలు వినపడుతున్నాయి. మొత్తమ్మీద జనసేనలో ఏ అభ్యర్థి విషయంలోనూ లేని నిరసన, కేవలం పిఠాపురంలో పవన్ పోటీచేస్తానంటేనే ఎందుకొచ్చింది. జనసైనికులారా..! మీకు అర్థమవుతోందా..?