అది నేనే.. ఇది నేనే.. ఊహా లోకంలో పవన్
తానేదో కూటమి సృష్టికర్త అనుకుంటున్న పవన్.. గతిలేని పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు తనతో చేతులు కలిపాయనే విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు.
"భీమవరంలో నన్ను గెలిపించి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. ఎన్నికల్లో గెలవని ఒక నాయకుడు అసాధ్యం అనుకున్న మూడు పార్టీల కూటమికి ప్రధాన సంధాన కర్తగా మారాడు." నిన్న చేరికల సభలో పవన్ తన గురించి తాను కొట్టుకున్న డప్పు ఇది. ఎన్నికల్లో గెలవలేకపోయినా తాను కూటమిని సృష్టించానని అతిగా ఊహించుకుంటున్నారాయన. పవన్ ని అలా ఊహాలోకంలోకి నెట్టేయడంలో చంద్రబాబు పూర్తిగా విజయం సాధించారు.
రెడీ సినిమాలో బ్రహ్మానందం తాను సృష్టించిన పాత్రలన్నీ నిజ జీవితంలోకి వచ్చేస్తున్నాయని సంబరపడుతుంటారు. ఒక కొత్త ఊహాలోకాన్నే సృష్టిస్తానంటూ భ్రమపడుతుంటారు. సరిగ్గా పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. తానేదో కూటమి సృష్టికర్త అనుకుంటున్న పవన్.. గతిలేని పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు తనతో చేతులు కలిపాయనే విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు. పూర్తిగా భ్రమల్లో బతికేస్తున్నారు. ఎన్నిసీట్లు అన్నది ముఖ్యం కాదు, ఈసారి వ్యూహాన్ని నాకు వదిలేయండి, నేను చూసుకుంటా అంటూ రెచ్చిపోతున్నారు పవన్.
2014 ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే వ్యూహంతో నాయకుడిగా ఫెయిలయ్యారు పవన్. సీఎం సీఎం అంటూ కార్యకర్తలు గోల చేస్తుంటే ఈసారి ఏదో సాధించేద్దామంటూ 2019 ఎన్నికల్లో పోటీ చేసి బొక్కబోర్లా పడ్డారు. పార్టీ సంస్థాగత నిర్మాణం లేకుండా ఆయన ఎన్నికలకు వెళ్లి చేదు ఫలితాన్ని చవిచూశారు. తీరా ఇప్పుడు కాస్తో కూస్తో పార్టీ జనాల్లోకి వెళ్లింది అనుకుంటున్న టైమ్ లో 21 సీట్లతో సరిపెట్టుకున్నారు. అంటే ప్రతి సారీ పవన్ తప్పుడు వ్యూహాలతోనే జనంలోకి వస్తున్నారు. కార్యకర్తల్ని నిరాశలోకి నెట్టేస్తూనే ఉన్నాయి. అయితే పవన్ మాత్రం ఓ మాయా ప్రపంచంలో విహరించడం ఇక్కడ విశేషం. తనని తాను చాలా ఎక్కువగా ఊహించేసుకుంటూ, జగన్ కి యుద్ధం పరిచయం చేస్తా, ప్రభుత్వాన్ని కూలగొడతానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కి తత్వం బోధపడటం గ్యారెంటీ అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అప్పుడు కూడా ఆయన పార్టీ కేడర్ పై నిందలేసి చేతులు దులుపుకుంటారని, సినిమా షూటింగ్ లకు వెళ్లిపోతారనే ప్రచారం కూడా జరుగుతోంది.