మధ్యంతర ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సూచన
ఎన్నికలైపోయినా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కడం మాత్రం మానలేదు పవన్ కల్యాణ్. మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన లేఖ రాశారు.
ఎన్నికలైపోయిన మరుసటి రోజే పవన్ కల్యాణ్ ఓ బహిరంగ లేఖతో తెరపైకి వచ్చారు. మధ్యంతర ప్రభుత్వానికి నా సూచన అంటూ ఆయన ఓ లెటర్ రాశారు. పంట కాల్వల మరమ్మతులు చేపట్టాలని, యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేయాలని ఆయన తన లేఖలో సూచించారు. రుతు పవనాలు ప్రవేశించేలోగా పనులు పూర్తి చేయాలని అంటున్నారు పవన్ కల్యాణ్.
ఎన్నికలైపోయినా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కడం మాత్రం మానలేదు పవన్ కల్యాణ్. గత ఐదేళ్లలో ఏపీలో పంట కాల్వల మరమ్మతుల్ని ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పటికైనా ఆ పని చేయాలంటూ ఆయన ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసింది కాబట్టి, మధ్యంతర ప్రభుత్వం జలవనరుల శాఖతో ఈ అంశంపై సమీక్ష జరపాలని కోరారు పవన్. రాష్ట్రంలోని పంట కాల్వలన్నీ పూడికతో నిండిపోయి ఉన్నాయని, చివరి ఆయకట్టుకి నీరు అందడంలేదని, గతేడాది పశ్చిమ కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోవడానికి కారణం ఇదేనని చెప్పారాయన. వెంటనే మరమ్మతులు చేపట్టాలని జనసేనాని సూచించారు.
సహజంగా పోలింగ్ తర్వాత నాయకులంతా గెలుపు ధీమాతో సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతుంటారు. కానీ పవన్ మాత్రం ప్రజా సమస్యలపై స్పందించారంటూ జనసైనికులు ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తున్నారు. అటు వైసీపీ నుంచి కూడా అంతే ఘాటుగా సమాధానాలు వస్తున్నాయి. ప్రజలు స్పష్టమైన తీర్పునివ్వబోతున్నారని, ఇకనైనా వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే పనులు మానేయాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ లేఖపై వైసీపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.