తాంబూళాలిచ్చేశాం తన్నుకు చావండి..
30 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలను జనసేన-బీజేపీకి ఉమ్మడిగా కేటాయించారు చంద్రబాబు. ఆ లెక్కలు వారినే తేల్చుకోవాలని చెప్పేశారు. దీంతో బీజేపీ నేతలతో సీట్ల లెక్కలు తేల్చుకోడానికి పవన్ మల్లగుల్లాలు పడుతున్నారు.
ఏపీలో కూటమి లెక్కలు ఇంకా పూర్తిగా తేలలేదు. అయితే టీడీపీ మాత్రం జనసేన-బీజేపీని ఒకే గాటన కట్టేసి తన పని తాను చేసుకు పోతోంది. తాంబూళాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. 30 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలను జనసేన-బీజేపీకి ఉమ్మడిగా కేటాయించారు చంద్రబాబు. ఆ లెక్కలు వారినే తేల్చుకోవాలని చెప్పేశారు. దీంతో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ సీట్ల లెక్కలు తేల్చుకోడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండాలతో సమావేశమయ్యారు పవన్. కానీ లెక్కలు తేలకపోవడంతో ఈరోజు మరోసారి మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించారు.
కూటమిలో మరో కూటమి..
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కట్టాలని నిర్ణయించాయి. అయితే ఇందులో టీడీపీ తన సీట్లు తాను తీసుకుని బయటకొచ్చేసింది. 30 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల విషయంలో బీజేపీ-జనసేన కలసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందులో ఎవరెన్ని సీట్లు తీసుకోవాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది వారి ఇష్టం. ఎక్కువ అసెంబ్లీ, తక్కువ లోక్ సభ సీట్లు ఇచ్చి జనసేను బుజ్జగించాలని చూస్తోంది బీజేపీ. ఆ సమీకరణాలు తేలేదెప్పుడో చూడాలి.
గతంలో ఓడిపోయే స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చి, గ్యారెంటీగా గెలిచే స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టేవారు చంద్రబాబు. తర్వాతి కాలంలో టీడీపీ నేతల్నే ఆయా పార్టీల్లోకి పంపించి వారి గుర్తులపై పోటీ చేసేలా చూశారు. ఇప్పుడు మిత్రపక్షాలైన బీజేపీ-జనసేన కూడా తెలివిమీరిపోయాయి కాబట్టి చంద్రబాబు వ్యూహాలు ఫలించేలా లేవు. దీంతో బీజేపీ-జనసేనకు సీట్ల లెక్కలు వదిలేసి తమాషా చూస్తున్నారు చంద్రబాబు. అయితే ఇప్పుడు కూడా తన నమ్మకస్తులకే ఆయా పార్టీల్లో సీట్లు దక్కేలా వ్యూహరచన చేశారు.