పూనకాలు ఏమైపోయాయి..?
మాట్లాడింది కూడా ఓ 10 నిమిషాలే. ఆ స్పీచు కూడా చాలా డల్లుగా ఉంది. పైగా టీడీపీతో జనసేన కలయికకు బీజేపీ అగ్రనేతల అనుమతి లేదని తనంతట తానుగానే బయటపెట్టారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏమైందో అర్థంకావటంలేదు. పోలిపల్లి బహిరంగసభలో మాట్లాడింది పవనేనా అన్న సందేహం పెరిగిపోయింది. బహిరంగసభలో పవన్ మాట్లాడిన విధానం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. మామూలుగా అయితే పవన్ ఎక్కడమాట్లాడినా పూనకాలతో ఊగిపోతుంటారు. ఆ ఊగిపోవటంలో తాను ఏమి మాట్లాడుతున్నారో కూడా ఎవరికీ అర్థంకానట్లుగా గట్టిగట్టిగా కేకలు పెట్టేస్తుంటారు. అలాంటి పవన్ తాజా స్పీచులో పూనకం కాదుకదా అసలు ఉత్సాహమే కనబడలేదు.
పోలిపల్లిలో పవన్ అడుగుపెట్టింది మొదలు ఎందుకో నిరుత్సాహంతో కనిపించారు. వేదిక మీదకు చేరుకునే ముందు పక్కన చంద్రబాబునాయుడు ఉన్నపుడు మాత్రమే కాస్త నవ్వుతో కనిపించారు. ఆ నవ్వు కూడా తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉందే తప్ప సహజంగా లేదు. వేదిక మీద కూర్చున్నదగ్గర నుంచి ఎందుకనో ఎక్కువసేపు తలొంచుకునే కూర్చున్నారు. పక్కనే చంద్రబాబు కూర్చున్నా పెద్దగా మాట్లాడలేదు. అలాగే నారా లోకేష్ తో కూడా పెద్దగా మాట్లాడలేదు. చంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా పవన్ ఎందుకో డల్లుగానే కనిపించారు.
చివరకు మాట్లాడింది కూడా ఓ 10 నిమిషాలే. ఆ స్పీచు కూడా చాలా డల్లుగా ఉంది. పైగా టీడీపీతో జనసేన కలయికకు బీజేపీ అగ్రనేతల అనుమతి లేదని తనంతట తానుగానే బయటపెట్టారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను టీడీపీతో చేతులు కలపక తప్పదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చెప్పి అనుమతి అడిగినట్లు చెప్పారు. ఇంతవరకు అమిత్ అనుమతి ఇవ్వలేదని కూడా పవనే చెప్పారు. అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి టీడీపీతో పవన్ చేతులు కలపటాన్ని బీజేపీ అంగీకరించలేదని అర్థమైపోతోంది.
ఎన్నికలు మరో నాలుగు మాసాలుండగా టీడీపీ+జనసేన పొత్తును బీజేపీ అంగీకరిస్తుందో లేదో తెలీదు. కాకపోతే బీజేపీ ఆమోదం లేకుండానే, ఆమోదం అవసరం లేకుండానే తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు పవన్ చెప్పేశారు. మరీనేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ అర్థంకావటంలేదు. బీజేపీతో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళటం చంద్రబాబుకు ఇష్టంలేదు. ఇదే సమయంలో బీజేపీ కలిసొస్తుందనే ఆశ పవన్‌లో లేదు. చివరకు ఏమి జరగుతుందో చూడాల్సిందే.