ప్యాకేజీకి అర్థం చెప్పించిన పవన్ కల్యాణ్..
ఏపీ గురించి ఒక్క ప్రశ్న కూడా లేవనెత్తని ఓ వ్యాపారవేత్తను వైసీపీ రాజ్యసభకు ఎలా పంపించిందంటూ ప్రశ్నంచారు. ప్యాకేజీ అంటే అదేనని చెప్పారు.
పవన్ కల్యాణ్ ని ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నేరుగా సీఎం జగన్ కూడా రంగంలోకి దిగారు. ఆయన కూడా పవన్ ని ప్యాకేజీ స్టార్ అంటూ కామెంట్ చేశారు. గతంలో ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా అంటూ ఓ బహిరంగ సభలో చెప్పుకూడా చూపించిన పవన్.. ఇక ఈ మాటకు బదులు చెప్పాల్సిందే అని డిసైడ్ అయ్యారు. అందుకే తన కథాకళి ఎపిసోడ్ లో ప్యాకేజీ, దాని నానార్థాలు అంటూ ఓ చర్చను వదిలారు. నాగబాబు, ఆయన మిత్రుడు అజయ్ కలసి చేసిన ఈ ఎపిసోడ్ ని తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్.
ప్యాకేజీ అనగా..
తనకో ధర్మ సందేహం ఉందని, అసలు ప్యాకేజీకి అర్థమేంటో చెప్పాలంటూ నాగబాబు, అజయ్ ని ప్రశ్నించడంతో ఈ ఎపిసోడ్ మొదలవుతుంది. దీనికి బదులుగా పరిమళ్ నత్వానీ రాజ్యసభ సభ్యత్వాన్ని తెరపైకి తెచ్చారు. పరిమళ్ నత్వానీ పేరెత్తకుండానే ఆయన రాజ్యసభ సభ్యత్వం విషయంలో జరిగిన ఎపిసోడ్ ని గుర్తు చేశారు. ఆయన్ను ఏపీ తరపున రాజ్యసభకు ఎందుకు పంపించారు, దానికి బదులుగా ఆయన వద్ద ఏం తీసుకున్నారు..? ఒకవేళ తీసుకుంటే దాన్ని ప్యాకేజీ అంటారా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఏపీ గురించి ఒక్క ప్రశ్న కూడా రాజ్యసభలో లేవనెత్తని ఓ వ్యాపారవేత్తను వైసీపీ రాజ్యసభకు ఎలా పంపించిందంటూ ప్రశ్నంచారు. ప్యాకేజీ అంటే అదేనని చెప్పారు.
సీఎం జగన్ ప్యాకేజీ తీసుకోవడంలోనే కాదు, ప్యాకేజీ ఇవ్వడంలోకూడా ఎక్స్ పర్టేనంటూ నాగబాబు మరో వీడియో ప్లే చేయించారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా.. గతంలో జగన్ గురించి చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. మొత్తంగా ప్యాకేజీ అంటూ పవన్ పై వస్తున్న విమర్శలకు కథాకళితో ఇలా కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్. ప్యాకేజీకి అర్థం చెప్పించారు.