ఎక్కువ ఊహించుకుంటున్నారా?
ఢిల్లీ పర్యటన సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలు, పొత్తులు, ఎన్డీయే విధానాలను జనాల్లోకి తీసుకెళ్ళటం, ఏపీ, తెలంగాణ భవిష్యత్తు తదితర అంశాలపై చర్చించబోతున్నట్లు చెప్పారు.
జనసేన అధినేత పవన్ కల్యాన్‌తో పెద్ద సమస్య ఉంది. అదేమిటంటే తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటం. ఇప్పుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాటలు దాన్నే సూచిస్తున్నాయి. ఇంతకీ పవన్ ఏమన్నారంటే ఏపీ రాజకీయాలు, పొత్తులు, ఎన్డీయే విధానాలను జనాల్లోకి తీసుకెళ్ళటం, ఏపీ, తెలంగాణ భవిష్యత్తు తదితర అంశాలపై చర్చించబోతున్నట్లు చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను జనాల్లోకి తీసుకెళ్ళటం మినహా ఇంకే విషయమై చర్చకు వచ్చే అవకాశం లేదు.
ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏపీ విషయంలో అసలు దృష్టే లేదు. మోడీకి లేదు కాబట్టి అమిత్ షా, జేపీ నడ్డాలు కూడా పెద్దగా పట్టించుకోవటంలేదు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవటం, సీట్ల షేరింగ్ లాంటి అంశాలపై పవన్‌తో మహా అయితూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడచ్చంతే. మోడీ, అమిత్ షా దృష్టంతా ఉత్తర భారతంపైనే ఉంటుంది. అలాంటిది పొత్తులు, ఏపీ రాజకీయాల్లాంటి అంశాలపై పవన్‌తో చర్చించేందుకు మోడీ, అమిత్‌కు పెద్దగా సమయం ఉండకపోవచ్చు.
భాగస్వామ్య పక్షాల సమావేశం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోరోజు లేదా ప్రత్యేకంగా మరోసారి చర్చిద్దామని చెప్పి పవన్‌ను పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనసేనకు ఉన్న బలమేముందని పవన్‌కు ఇంతగా మోడీ, అమిత్ షా ప్రాధాన్యత ఇవ్వటానికి. అందుకనే పవన్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా మోడీ, అమిత్ షా లు కలవటమే లేదు. రెండు, మూడు రోజులు వెయిట్ చేసి అపాయిట్మెంట్ దొరక్క తిరిగి వచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మోడీ తనకు బాగా సన్నిహితుడని పవన్ చెప్పుకుంటే సరిపోదు. పవన్ తనకు సన్నిహితుడని మోడీ అనుకున్నప్పుడే పవన్‌కు అపాయిట్మెంట్ దొరుకుతుంది.
అప్పటివరకు పవన్‌కు సునీల్ ధియోధర్, మురళీ ధరనే దిక్కు. నిజానికి పేరుకు ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశమే కానీ బ్యాటింగ్ అంతా వన్ సైడ్ మాత్రమే జరుగుతుందని అందరికీ తెలిసిందే. మోడీ చెప్పేది మిగిలినవాళ్ళు వినాల్సిందే కానీ భాగస్వామ్య పార్టీల అధినేతలు చెప్పేది మోడీ పెద్దగా వినరు. ఈ నేపథ్యంలో పవన్ చెప్పేది ఏముంది? చర్చించేది ఏముంటుంది?