వాళ్లకి ధైర్యం లేదు, పారిపోయారు.. అసెంబ్లీలో పవన్ పంచ్ లు
విజయాన్ని తీసుకున్నారు కానీ, ఓటమిని అంగీకరించలేకపోతున్నారని వైసీపీ నేతల్ని విమర్శించారు పవన్ కల్యాణ్.
అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన తర్వాత ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ప్రతిపక్ష వైసీపీపై సెటైర్లు పేల్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వైసీపీ ఈసారి 11 సీట్లకే పరిమితం అయిందని, అయితే వారికి ధైర్యం లేక సభనుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. విజయాన్ని తీసుకున్నారు కానీ, ఓటమిని అంగీకరించలేకపోతున్నారని అన్నారు. మొదటి రోజు వైసీపీ ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండోరోజు అసెంబ్లీకి జగన్ సహా ఎవరూ రాలేదు. జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లారు, మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారికి కౌంటర్ ఇచ్చారు.
స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడని కొనియాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయనకు కోపం వస్తే ఉత్తరాంధ్ర పదునైన భాషలో రుషికొండను చెక్కినట్టు ప్రత్యర్థుల్ని మాటల్తో చెక్కేసేవారని అన్నారు. ఇన్నాళ్లూ వారి వాడి వేడి భాషను చూశామని, ఇకపై ఆయన నుంచి అలాంటి ఘాటు వ్యాఖ్యల్ని వినలేమని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ గా ఆయన ఇప్పుడు తగువులు తీర్చాల్సిన బాధ్యత తలకెత్తుకున్నారనన్నారు. ఆయన హయాంలో సభ హుందాగా సాగాలని, సభలో ఎవరు తిడుతున్నా ఆయనే పరిష్కరించాలన్నారు. డిబేట్స్ వెనకాల దాక్కొని సంస్కార హీనమైన భాషను వాడేవారిని నియంత్రించాలని కోరారు పవన్.
గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణ ఎక్కువగా ఉండేదని, బూతులు, వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారని వైసీపీ నేతలపై మండిపడ్డారు పవన్ కల్యాణ్. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదన్నారాయన. భాష మనుషుల్ని కలపడానికే కానీ, విడగొట్టడానికి కాదన్నారు. ఎంత పెద్ద సమస్య అయినా, చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. దానికోసం శాసన సభ ఉపయోగపడాలన్నారు పవన్. భవిష్యత్ కి ఇదొక ప్రామాణికం కావాలని ఆకాంక్షించారు.