వైఎస్ఆర్ మరణంపై పవన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమలను వైసీపీ ప్రభుత్వం రిసార్ట్ లా మార్చిందని ఆరోపించారు పవన్. వైసీపీని విమర్శించడం వరకు ఓకే కానీ, వైఎస్ఆర్ మరణంపై పవన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపాయి.
వైఎస్ఆర్ మరణం గురించి గతంలో చంద్రబాబు హేళనగా మాట్లాడిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా దివంగత నేత మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల్ని విమర్శించే క్రమంలో వైఎస్ఆర్ ని టార్గెట్ చేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ఖండిస్తున్నారు. జనసేనానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏడు కొండల్ని రెండు కొండలు చేస్తానంటూ వైఎస్ఆర్ అన్నారని, అలా అన్నందుకు ఆయన ఏమయ్యారో తెలుసుకదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. తాము అధికారంలోకి రాగానే తిరుమల పవిత్రత కాపాడుతామన్నారు. వైసీపీ వాళ్ళు ఓట్ల కోసం ఇచ్చే డబ్బు వెంకన్న స్వామిదని.. ఆ డబ్బును తీసుకుని వెంకన్న హుండీలో వేసేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు పవన్.
తిరుపతి రోడ్ షో లో.. గోవిందా గోవిందా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్, ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడం అవసరమా అని ప్రశ్నించారు. పేదలకు సేవ చేసే కూటమి అభ్యర్థిని గెలిపించాలన్నారు. రేణిగుంట నుండి అమరరాజా కంపెనీ, వోల్టాస్, రియల్ లైన్ కంపెనీలను వైసీపీ ప్రభుత్వం తరిమేసిందని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే, రెండో మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తిరుమలను వైసీపీ ప్రభుత్వం రిసార్ట్ లా మార్చిందని ఆరోపించారు పవన్. వైసీపీని విమర్శించడం వరకు ఓకే కానీ, వైఎస్ఆర్ మరణంపై పవన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపాయి. అన్ని పార్టీల్లోనూ వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారని, అలాంటి వారందరికీ పవన్ ఆగ్రహం తెప్పించారని అంటున్నారు నెటిజన్లు.