నమ్ముకున్నోళ్లకు న్యాయం చేయలేను.. హింట్ ఇచ్చిన పవన్
డబ్బుతో ఓట్లు కొనాలని తాను చెప్పడం లేదని, కానీ నాయకులు కావాలంటే ఖర్చు పెట్టి తీరాలని చెప్పారు పవన్. రూపాయి ఖర్చు చేయకుండా ఎవరూ నాయకులు కాలేరన్నారు. మంచి వారినే పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, అలాంటి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పారు.
ఇటీవల జనసేనకు సంబంధించి ఒకటి రెండు నియోజకవర్గాల్లో టికెట్లు ఖాయం చేశారు పవన్ కల్యాణ్. మరికొన్ని చోట్ల ఇన్ చార్జ్ లను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది పక్క పార్టీలనుంచి వచ్చినవారే ఉండటం విశేషం. అప్పటికప్పుడు కండువా కప్పడం, ఫలానా నియోజకవర్గం నీకేపో అని చెప్పడం ఇదీ పవన్ వాటం. మరి పార్టీని నమ్ముకున్నోళ్ల సంగతేంటి..? వారికి ఈరోజు దాదాపుగా క్లారిటీ ఇచ్చేశారు జనసేనాని.
డబ్బులుంటేనే రాజకీయం..
విశాఖ వారాహి యాత్రకోసం సమీక్షలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్.. జనసేన క్రియాశీలక నేతల మీటింగ్ లో హితోపదేశం చేశారు. జనసేన నేతలకు త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలన్నారు. తమ సొమ్ము ప్రజలకు పంచే నేతలు కావాలన్నారు. డబ్బుతో ఓట్లు కొనాలని తాను చెప్పడం లేదని, కానీ నాయకులు కావాలంటే ఖర్చు పెట్టి తీరాలని చెప్పారు. రూపాయి ఖర్చు చేయకుండా ఎవరూ నాయకులు కాలేరన్నారు. మంచి వారినే పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, అలాంటి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని ఆల్రడీ ఉన్నవారికి దిశా నిర్దేశం చేశారు.
పవన్ వ్యాఖ్యల మర్మమేంటి..?
ఎన్నికల ఏడాదిలో అడుగు పెడుతున్నామని, ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు జనసేనాని. యథావిధిగా వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆయన, జనసేనలో టికెట్లకోసం ఎవరూ డబ్బులు ఖర్చుపెట్టాల్సిన పని లేదన్నారు. తన చుట్టూ తిరిగితే నాయకులు కాలేరని కూడా సెలవిచ్చారు. రాగాపోగా.. కొత్తవారు వస్తుంటే, ఉన్నవారు ఉడుక్కోవద్దని మాత్రం తేల్చి చెప్పారు పవన్. అదే సమయంలో ఖర్చుపెట్టుకోగలిగే వారే నాయకులవుతారని, అలాంటి వారిని పార్టీ ప్రోత్సహిస్తుందని పరోక్షంగా చెప్పేశారు. పొత్తుల ఎత్తుల్లో సీట్లు దక్కవు అని ఈపాటికే చాలామంది జనసేన ఔత్సాహిక నేతలు డిసైడ్ అయ్యారు, అయితే బలవంతులకే టికెట్లు అనే కాన్సెప్ట్ తో కొత్తవారిని చేర్చుకుంటూ పాతవారిని మరింత వెనక్కు నెట్టేస్తారనే సంకేతాలు ఇప్పుడు బలంగా కనపడుతున్నాయి. ఒకరకంగా టికెట్లు ఆశిస్తున్న నేతల్ని మెంటల్ గా ప్రిపేర్ చేసే పనిలో పడ్డారు జనసేనాని.