నెలరోజులు వెయిట్ చేస్తా -పవన్
ఏడాదిన్నరగా బాధితులకు సరైన పునరావాసం కల్పించడంలో విఫలమైన అధికారుల నెలరోజుల హామీపై పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. నెలరోజులు తాము వేచి చూస్తామని చెప్పారు.
వరదలకు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఏడాదిన్నర అవుతున్నా బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదని ఇటీవల పవన్ కల్యాణ్ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియా కూడా ఆ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దీంతో ప్రభుత్వం కూడా పరిహార చర్యలపై దృష్టిపెట్టింది. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని నెలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష. వారికి మౌలిక సదుపాయాలు కూడా యుద్ధప్రాతిపదికన కల్పిస్తామని చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్.. నెలరోజుల గడువులో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని నమ్మకంగా చెప్పారు. దీనిపై పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు.
నెలరోజులు వెయిట్ చేస్తాం..
ఏడాదిన్నరగా బాధితులకు సరైన పునరావాసం కల్పించడంలో విఫలమైన అధికారుల నెలరోజుల హామీపై పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. నెలరోజులు తాము వేచి చూస్తామని చెప్పారు. అధికారులు తమ హామీని ఏమేరకు నిలబెట్టుకుంటారో చూస్తామన్నారు.
పవన్ కల్యాణ్ ఇటీవల వైసీపీపై విమర్శల డోసు పెంచారు. బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన విమర్శల అనంతరం పవన్ మరింత స్పీడయ్యారు. నేరుగా జగన్ ని టార్గెట్ చేస్తూనే, వైసీపీ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. ఏడాదిన్నర అవుతున్నా అన్నమయ్య డ్యామ్ బాధితులకు న్యాయం చేయలేకపోయారని విమర్శలు ఎక్కు పెట్టారు పవన్. అధికారులు హామీ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టినట్టు ట్వీట్ వేశారు. ఈ విషయంలో తాను ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటానని పరోక్షంగా తేల్చి చెప్పారు పవన్.