ఆ విషయంలో హర్ట్ అయ్యా.. మోదీ సభకు రాలేకపోయా..
భీమవరంలో సభ పెట్టి స్థానిక ఎంపీ రఘురామ కృష్ణంరాజుని పిలవలేదని అందుకే ఆ విషయంలో తాను హర్ట్ అయ్యాయనని అంటున్నారు పవన్ కల్యాణ్.
ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ, బహిరంగ సభకు పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన నాయకుడు ఎందుకు కనిపించలేదు అనే అనుమానాలు వచ్చాయి. ఆహ్వానం అందలేదని కొందరు సెటైర్లు వేశారు, ఆహ్వానం అందినా సీఎం జగన్ తో వేదిక పంచుకోవడం ఇష్టంలేక పవన్ వెళ్లలేదని, అది ఆయన ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అని ఇంకొందరు గొప్పగా చెప్పుకున్నారు. ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది, రోజులు గడిచిపోయాయి, ఇప్పుడెవరికీ ఆ విషయంపై ఆసక్తి లేదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తీరిగ్గా ఇప్పుడు వివరణ ఇచ్చుకున్నారు. ఆహ్వానం ఉంది కానీ తాను ఆ సభకు వెెళ్లలేదని చెప్పారు.
ఆయన్ని హర్ట్ చేశారు, నేనూ హర్ట్ అయ్యా..
భీమవరంలో సభ పెట్టి స్థానిక ఎంపీ రఘురామ కృష్ణంరాజుని పిలవలేదని అందుకే ఆ విషయంలో తాను హర్ట్ అయ్యాయనని అంటున్నారు పవన్ కల్యాణ్. తనకు ఆహ్వానం ఉందని, తాను రైలులో వస్తున్నానంటూ సభకు ముందురోజు రఘురామ చాలా హడావిడి చేశారు, చివరకు తన అభిమానుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక వెనక్కి వెళ్లిపోతున్నానని స్టేట్ మెంట్ ఇచ్చారు. మరి ఆయనకు ఆహ్వానం లేదని ఈయనకు ఎలా తెలిసిందనేదే ఇప్పుడు హాట్ టాపిక్. పోనీ రఘురామకృష్ణంరాజుకి అవమానం జరిగిందనే పవన్ కల్యాణ్ రాలేదని అనుకున్నా.. కనీసం ఆ విషయం చెప్పడానికి ఇన్నిరోజులు టైమ్ ఎందుకు తీసుకున్నారో పవన్ కల్యాణ్ కే తెలియాలి.
తిట్టారు, కొట్టారు, హింసించారు..
రఘురామకృష్ణంరాజుని విచారణ పేరుతో తిట్టారని, కొట్టారని, హింసించారని పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తాము ప్రత్యర్థులమే అయినా.. తాను రాజకీయాలను పట్టించుకోనని, మానవత్వాన్ని మాత్రమే పట్టించుకుంటానని సెలవిచ్చారు పవన్. రఘురామ తన కులం కూడా కాదని చెప్పుకొచ్చారు. ఆ విషయంలో క్షత్రియులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
పులివెందులలో కార్యక్రమం పెట్టి, మిమ్మల్ని ఆహ్వానించకపోతే ఎలా ఉంటుందో, భీమవరంలో మీటింగ్ పెట్టి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోతే అలాగే ఉంటుందని విమర్శించారు పవన్ కల్యాణ్. స్థానిక ఎంపీకే ఆహ్వానం లేనప్పుడు ఇక తానెందుకు వెళ్లాలని అనుకున్నానని, అందుకే ఆహ్వానం ఉన్నా వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఆమధ్య మోదీ సభలో తన అన్నయ్య చిరంజీవి మినహా మిగతా అందరూ గొప్పగా నటించారంటూ నాగబాబు సెటైర్లు వేశారు, ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ ఆహ్వానం ఉన్నా అందుకే తాను వెళ్లలేదంటూ లోగుట్టు విప్పారు. పవన్ హాట్ కామెంట్స్ తో బీజేపీ-జనసేన మధ్య ఏదో జరుగుతోందనే విషయం మరోసారి రుజువైంది.