సినిమా వేడుకలో సీఎం.. సీఎం..
అభిమానులంతా సీఎం.. సీఎం అంటూ గోల చేశారు. "అవి రాజకీయాలు కదా, ఇది సినిమా ఫంక్షన్" అంటూ ఆ తర్వాత వారికి సర్దిచెప్పారు పవన్.
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలసి నటించిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్ లో సీఎం.. సీఎం అనే నినాదాలు మారుమోగాయి. పవన్ కల్యాణ్ ప్రసంగం మొదలు కాగానే హాలంతా అరుపులు, కేకలు వినిపించాయి. ఆ డోస్ సరిపోలేదమనుకున్నారో ఏమో.. పవన్ మెల్లగా రాజకీయం అనే ప్రస్తావన తెచ్చారు. ఇంకేముంది అభిమానులంతా సీఎం.. సీఎం అంటూ గోల చేశారు. "అవి రాజకీయాలు కదా, ఇది సినిమా ఫంక్షన్" అంటూ ఆ తర్వాత వారికి సర్దిచెప్పారు పవన్. ఇటీవల రాజకీయాల వల్ల సినిమాలకు కాస్త టైమ్ తగ్గించానని చెప్పుకొచ్చారు. కరోనా టైమ్ లో రాజకీయంగా కూడా ఏమీ చేయడానికి వీలు లేనప్పుడు బ్రో సినిమా ఒప్పుకున్నానని అన్నారు పవన్.
మా వదిన చేసిన తప్పు అది..
తాను సినిమాల్లోకి రావడం, ఈ స్థాయిలో ఉండటం.. ఇదంతా తన వదిన చేసిన తప్పు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్. అప్పట్లో భుజం తట్టి ముందుకెళ్లు అని వదిన చెప్పారని, ఆమె అలా ప్రోత్సహించకపోయి ఉంటే, తానిప్పుడు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడినని అన్నారు. ఆమె చేసిన ద్రోహం వల్ల తానిప్పుడు అభిమానుల ముందు ఇలా నిలబడ్డానంటూ సరదాగా చెప్పుకొచ్చారు.
హీరోలందరి పేర్లు..
ఇటీవల వారాహి యాత్రల్లో ప్రస్తావించినట్టే హీరోలందరి పేర్లు సినిమా వేదికలపై కూడా చెప్పుకొచ్చారు పవన్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లా తాను డ్యాన్స్ చేయలేకపోవచ్చని.. ప్రభాస్, రానా లాగా బలమైన పాత్రలు చేయలేకపోవచ్చని అన్నారు. హీరోలందరూ తనకు ఇష్టమని, హీరోలు సినిమాలు చేస్తే ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు పవన్.
రాజకీయాల్లో బాబాయ్ వెంటే..
సినిమాలయినా, రాజకీయాలయినా.. బాబాయ్ వెంటే మెగా కుటుంబం అంతా ఉంటుందని చెప్పారు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. రాజకీయంగా ఆయన ఎండా వానల్లో తిరుగుతుంటే తాను బాధపడ్డానని.. కానీ ఆయన మీ అందరికీ దగ్గరవుతున్నారని అనుకున్నప్పుడు సంతోషంగా ఉందని చెప్పారు. అభిమానులెప్పుడూ కల్యాణ్ బాబాయ్ వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు వరుణ్ తేజ్.