టీడీపీ నేతలకు జనసేన టికెట్లు.. ఇదెక్కడి న్యాయం పవన్..?
గతంలో జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించారు, బీజేపీ కలిశాక అందులో మూడు తెగ్గోసి 21కి పరిమితం చేశారు. తీరా ఆ 21లో కూడా మెజార్టీ అభ్యర్థులు టీడీపీ నుంచి వచ్చినవారే కనిపిస్తున్నారు.
కూటమిలో ఊహించిందే జరిగింది. పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయించినా, పోటీ చేసేది మాత్రం టీడీపీ నేతలే. టీడీపీ నేతలకు జనసేన కండువాలు కప్పి గాజు గ్లాసు గుర్తుపై బరిలో దింపేలా చంద్రబాబు బ్రహ్మాండమైన స్కెచ్ వేశారు. పవన్ చేతగాని తనం వల్ల అదిప్పుడు సక్సెస్ ఫుల్ గా అమలవుతోంది. నిన్నటికి నిన్న భీమవరం నుంచి మాజీ ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులుని జనసేనలో చేర్చుకుని టికెట్ ఖరారు చేశారు పవన్. టీడీపీ అభ్యర్థిగా 2014లో భీమవరం నుంచి గెలిచిన పులవర్తి, 2019లో ఓడిపోయారు. సదరు టీడీపీ నేతకు జనసేన కండువా కప్పి ఈసారి గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయిస్తున్నారు పవన్. ఇక ఈరోజు విషయానికొద్దాం. తిరుపతికి చెందిన టీడీపీ నేత గంటా నరహరి ఈరోజు జనసేనలో చేరారు. ఆయనకు తిరుపతి అసెంబ్లీ టికెట్ ఖాయమైందనేది బహిరంగ రహస్యం. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న నరహరి, ఈరోజు సడన్ గా జనసేనలో చేరి తిరుపతి టికెట్ సాధించారు. స్థానిక జనసేన నాయకులకు షాకిచ్చారు.
జనసేన నేతలకు టికెట్లు లేవా..?
భీమవరం, తిరుపతి మాత్రమే కాదు, నరసాపురంలో కూడా మాజీ టీడీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడికి జనసేన తరపున టికెట్ ఖాయమైంది. ఈ సీట్లు పొత్తులో జనసేనకు కేటాయించినవే అయినా అక్కడ పోటీ చేసేది మాత్రం టీడీపీ పాతకాపులే. సరిగ్గా ఎన్నికల ముందు జనసేన కండువా కప్పేసుకుని ఆ పార్టీ కోటాలో బరిలో దిగుతున్నారు. అంటే ఇక్కడ అసలు సిసలు జనసేన నేతలకు, ఆశావహులకు పూర్తి అన్యాయం జరుగుతోందనేది బహిరంగ రహస్యం. జనసేన నేతలు లోలోపల మథనపడుతున్నా.. పవన్ మాత్రం పూర్తిగా లైట్ తీసుకున్నారు, బాబు వ్యూహాన్నే అమలు చేస్తున్నారు.
గతంలో జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించారు, బీజేపీ కలిశాక అందులో మూడు తెగ్గోసి 21కి పరిమితం చేశారు. తీరా ఆ 21లో కూడా మెజార్టీ అభ్యర్థులు టీడీపీ నుంచి వచ్చినవారే కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ టీడీపీ డామినేషన్ స్పష్టంగా తెలుస్తోంది. రేపు ఎన్నికల తర్వాత జనసేన తరపున గెలిచినా, వారు చంద్రబాబుకే కట్టప్పలుగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనసేన జెండా మోసినవారు, నియోజకవర్గాల్లో డబ్బు ఖర్చు పెట్టుకుని తిరిగిన వాళ్లు, పోటీ పడి పార్టీ సభ్యత్వాలు చేసినవాళ్లు, పవన్ కోసం సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలి కేసులు పెట్టించుకున్న వాళ్లు.. ఇలా అందర్నీ హోల్ సేల్ గా మోసం చేశారు జనసేనాని. చంద్రబాబు వెన్నుపోటు కంటే.. పవన్ కల్యాణ్ పోటే మరింత దారుణంగా ఉందని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.