ఏపీకి బీసీ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉంది
సీఎం జగన్ కులాలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని, కానీ తాను కులాలను కలుపుతున్నానని చెప్పారు పవన్. ముగ్గురు, నలుగురికి నామినేటెడ్ పదవులిచ్చి బీసీలను ఉద్ధరించామంటే కుదరదన్నారు.
తనను ముఖ్యమంత్రిని చేయండి, జనసేనకు అధికారమివ్వండి అంటూ కొన్నిరోజులుగా చెబుతూ వస్తున్న పవన్ కల్యాణ్, సడన్ గా బీసీ ముఖ్యమంత్రి అనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. బీమవరంలో శెట్టిబలిజ, గౌడ కులస్తులతో మాట్లాడిన ఆయన.. బీసీలకు రాజ్యాధికారం రావాలన్నారు. బీసీకులాలన్నీ ఐకమత్యంగా ఉండాలని చెప్పారు. సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తితో ఒక బీసీ నాయకుడు ఏపీకి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందన్నారు పవన్ కల్యాణ్.
కులాలను కలుపుతున్నా..
సీఎం జగన్ కులాలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని, కానీ తాను కులాలను కలుపుతున్నానని చెప్పారు పవన్ కల్యాణ్. ముగ్గురు, నలుగురికి నామినేటెడ్ పదవులిచ్చి బీసీలను ఉద్ధరించామంటే కుదరదన్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీ కులాలన్నీ రాజ్యాధికారం దిశగా ఎదగాలన్నారు పవన్. కోనసీమలో శెట్టిబలిజ, కాపుల మధ్య చర్చలు జరిపి ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి విభేదాలు తగ్గించానని చెప్పుకొచ్చారు.
జనసేన నుంచి స్థానిక సంస్థల్లో విజయం సాధించిన వారికి వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, జనసేన అధికారంలోకి వస్తే బీసీలను పంచాయతీ స్థాయి నుంచే బలపరుస్తామన్నారు పవన్. పనికిమాలిన కొత్త రకం మద్యం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని, జనసేన అధికారంలోకి వస్తే పాత విధానాన్నే క్రమబద్ధీకరిస్తామన్నారు. ఆ పాలసీలో గీత కార్మికులను భాగస్వాములను చేసేలా మేనిఫెస్టో తయారు చేస్తామని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే దామాషా పద్ధతిలో నియోజకవర్గానికి 500 మంది చొప్పున ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామన్నారు.
ఈరోజు భీమవరంలో బహిరంగ సభ..
ఈరోజు సాయంత్రం 4.30గంటలకు భీమవరంలో పవన్ కల్యాణ్ వారాహి బహిరంగ సభ ఉంది. దీనికోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో జగన్, ఇతర మంత్రులు చేసిన వ్యాఖ్యలకు భీమవరం నుంచి గట్టిగా బదులిచ్చేందుకు పవన్ కూడా సిద్ధమయ్యారు.