బాలకృష్ణకు పరిపూర్ణానంద స్వామి ‘హిందూత్వ’ సెగ
త్యాగాలు చేయాలని చంద్రబాబు చెప్పుతున్నారని, తమ లాంటి వాళ్లే త్యాగాలు చేయాలా, చంద్రబాబు కుటుంబ సభ్యులు త్యాగాలు చేయకూడదా అని కూడా అన్నారు.
హిందూపురం శాసనసభ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు పరిపూర్ణానంద స్వామి సెగ తప్పేట్లు లేదు. బీజేపీ తరఫున హిందూపురం లోకసభ స్థానాన్ని పరిపూర్ణానంద స్వామి ఆశించారు. అయితే, ఈ సీటుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థిగా అంబికా లక్ష్మినారాయణను ప్రకటించారు. దీంతో పరిపూర్ణానంద స్వామి భగ్గుమన్నారు. బాలకృష్ణనే తనకు టికెట్ రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. తాను లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తే దాని ప్రభావం ఆ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై కూడా పడుతుందని, ముస్లిం మైనారిటీలు కూటమికి దూరమయ్యే ప్రమాదం ఉందని బాలకృష్ణ, మరికొంత మంది చెప్పి తనకు టికెట్ రాకుండా చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.
మరో విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. హిందూపురానికి తాను స్థానికేతరుడినని ప్రచారం చేశారని అంటూ బాలకృష్ణ స్థానికుడా, ఆయన ఎక్కడ పుట్టారని పరిపూర్ణానంద ప్రశ్నించారు. మంగళగిరికి నారా లోకేష్ స్థానికేతరుడు కాడా అని ఆయన అడిగారు. కడప జిల్లాకు చెందిన సిఎం రమేష్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కదా అని ఆయన గుర్తు చేశారు.
త్యాగాలు చేయాలని చంద్రబాబు చెప్పుతున్నారని, తమ లాంటి వాళ్లే త్యాగాలు చేయాలా, చంద్రబాబు కుటుంబ సభ్యులు త్యాగాలు చేయకూడదా అని కూడా అన్నారు. చంద్రబాబు కుటుంబం నుంచి ఆయనతో పాటు నారా లోకేష్, పురంధేశ్వరి, నారా లోకేష్ తోడల్లుడు పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ టికెట్లు ఎక్కువగా టీడీపీకి చెందినవారికే ఇచ్చారని, జనసేన అభ్యర్థులు కూడా చాలా మంది టీడీపీకి చెందినవారేనని, దీంతో జనసేన నాయకులూ కార్యకర్తలు ఇళ్లకే పరిమితమవుతున్నారని ఆయన అన్నారు.
తాను వివిధ సంఘాలకు చెందిన 5 వేల మంది కార్యకర్తలను తయారు చేశానని, వారంతా తన కోసం పనిచేస్తారని, తాను హిందూపురం లోక్‌సభ స్థానానికే కాకుండా అసెంబ్లీ స్థానానికి కూడా పోటీ చేస్తానని ఆయన అన్నారు. పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తే దాని ప్రభావం బాలకృష్ణపై పడే అవకాశం ఉంది. పరిపూర్ణానంద స్వామి విజయం సాధించలేకపోవచ్చు గానీ బాలకృష్ణ విజయావకాశాలను దెబ్బ తీయవచ్చునని అంచనా వేస్తున్నారు. దీని నుంచి బాలకృష్ణ ఎలా బయటపడుతారనేది వేచి చూడాల్సిందే.