ఓ వైపు కంటి``పాప``..మరో వైపు మృత్యువు...అయినా..
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రెబ్బ గ్రామంలో గిరిజనులు ప్రాణాలు పణంగా పెట్టి ఓ చిన్నారిని కాపాడుకున్నారు.
కన్నకూతురిని రక్షించుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు తమ ప్రాణాలని పణంగా పెట్టారు. చిన్నారి వైద్యం కోసం కన్నవాళ్లతోపాటు బంధువులు కూడా మేము సైతం అంటూ జలగండానికి ఎదురీదారు. అంతా సవ్యంగా జరిగింది. కాబట్టి సరిపోయింది లేదంటే ఆ గిరిపుత్రులు జలసమాధి అయ్యేవారు. కొండంత కష్టంలోనూ వారి సమయస్ఫూర్తి, తెగువ చూస్తే అబ్బురమనిపిస్తుంది. ప్రమాదానికి ఎదురీదిన వారి సాహసం చూస్తే వీరు సామాన్యులు కాదు అనిపిస్తుంది. ఒడ్డుకి చేరేందుకు వారు తయారు చేసిన సాధనం చూస్తే, ఇంజనీర్లు కూడా వీరి ముందు దిగదుడుపే.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రెబ్బ గ్రామంలో గిరిజనులు ప్రాణాలు పణంగా పెట్టి ఓ చిన్నారిని కాపాడుకున్నారు. కొలక సోమేష్, చంద్రమ్మ దంపతుల ఏడేళ్ల కుమార్తె కొలక మరియమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా ఆర్ఎంపీలు వైద్యం అందిస్తున్నప్పటికీ జ్వరం తగ్గలేదు. మరింతగా ఆరోగ్య పరిస్థితి దిగజారింది.
తల్లడిల్లిన తల్లిదండ్రులకి ఏం చేయాలో పాలుపోలేదు. మెరుగైన వైద్యం అందించే దారి కూడా కానరాలేదు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామంలోని గిరిజనులు తమ బిడ్డని కాపాడుకోవాలంటే ఒడిశా రాష్ట్రం రాయఘడ తీసుకెళ్లాల్సిందే. కానీ వెళ్లే దారే లేదు. నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన నాగావళి నది దాటితేనే రాయఘడ చేరుకుంటారు. వంతెనలు లేవు. పడవ లేదు. నాగావళి బుసలు కొడుతున్న నాగువలె ప్రవహిస్తుంది. ఈ సమయంలో నాగావళి దాటడం ప్రమాదకరం అని ఆ తల్లిదండ్రులకి తెలుసు. ఆ ఊరి గిరిజనులు కూడా నది దాటే సాహసం చేయొద్దని హెచ్చరించారు.
కన్నతల్లిదండ్రులు కళ్లెదుటే బిడ్డ మరియమ్మ పరిస్థితి విషమంగా మారడంతో తట్టుకోలేకపోయారు. ప్రాణాలు పణంగా పెట్టయినా చిన్నారిని కాపాడుకుంటామని నిశ్చయించుకున్నారు. తోటి గిరిజనులు సాయంతో తండ్రి కొలక సోమేష్ వెదురుబొంగులతో చిన్న తెప్పను తయారు చేసి, దానిపై పాపను, భార్యను తీసుకొని తెప్పమీద నది దాటారు. గ్రామస్తులు సాయం చేశారు. ఇది చాలా ప్రమాదకరం అయినప్పటికీ పాప ప్రాణాలకు కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి నదికి అడ్డంగా ప్రయాణం చేసి అవతలి ఒడ్డుకు క్షేమంగా చేర్చారు. అక్కడ నుండి రాయఘడ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మరియమ్మని చేర్చారు. అక్కడ అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉంది.