సలహాదారులు కాదు, వాళ్లు స్వాహాదారులు..
సహజంగా ఏపీలో కాంగ్రెస్ నాయకుల విమర్శలను ఎవరూ పట్టించుకోరు. కానీ తులసిరెడ్డి టచ్ చేసిన సబ్జెక్ట్ హాట్ హాట్ గా ఉంది. అందులోనూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో సలహాదారు పోస్ట్ లపై తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అవకాశం ఇస్తే భవిష్యత్ లో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, తహశీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి అంతు ఎక్కడ ఉందని మండిపడింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్ధం చేసుకోగలం కానీ.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడం ఏంటని హైకోర్టు నిలదీసింది. ఆ తర్వాత ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. సలహాదారుల విషయంలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సహజంగా ఏపీలో కాంగ్రెస్ నాయకుల విమర్శలను ఎవరూ పట్టించుకోరు. కానీ తులసిరెడ్డి టచ్ చేసిన సబ్జెక్ట్ హాట్ హాట్ గా ఉంది. అందులోనూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సలహాదారులంతా ఏపీలో స్వాహాదారులుగా మారారని అన్నారు తులసిరెడ్డి. ప్రభుత్వ అధికారుల కంటే వీరు మంచి సలహాలు ఇస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు సలహదారుల వ్యవస్థ ఉపాధి హామీ పథకం వంటిదని చురకలంటించారు. సలహాదారుల పేరుతో జగన్ తన వాళ్లందరికీ ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటున్న సీఎం జగన్, తనవారికోసం ప్రత్యేకంగా సలహాదారు పోస్ట్ లను సృష్టించడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సలహాదారుల అర్హతలేంటి, వారు ఎలాంటి సలహాలిస్తున్నారు, వాటి వల్ల రాష్ట్రానికి కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ ఏమేరకు ఉపయోగం ఉంటుందనేది తేలాల్సి ఉంది. కులానికొక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దానికి చైర్మన్లు, ఉప చైర్మన్లు, డైరెక్టర్లు అంటూ పోస్ట్ లు సృష్టించి, వారికి కూడా జీతాలు, వాహన అలవెన్స్ లు ఇస్తున్నారు జగన్. కానీ ఆ చైర్మన్లతో ఆ కులాలకు జరుగుతున్న న్యాయం, లాభం ఏంటో తేలడంలేదు. సలహాదారు పోస్ట్ లు కూడా ఇలాంటివే. సలహాలివ్వడానికి, పాలన సక్రమంగా జరపడానికి ఐఏఎస్ లు ఉండగా, కొత్తగా సలహాదారులెందుకనేది అసలు ప్రశ్న. ఈ ప్రశ్నలో లాజిక్ ఉంది కానీ, వైసీపీ దగ్గర సమాధానం లేదు.
ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ సలహాదారు పోస్ట్ లపై ధ్వజమెత్తుతున్నాయి. ఏపీలో ప్రభుత్వ సలహాదారులందరూ తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. టీడీపీ, బీజేపీ, జనసేన కూడా ఇప్పటికే సలహాదారులపై భగ్గుమన్నాయి, మరోసారి ఈ సబ్జెక్ట్ ని హైలెట్ చేసే అవకాశం కూడా ఉంది.