కుప్పంలో చంద్రబాబు సభకు నో పర్మిషన్.. డీఎస్పీ నోటీసులు
రోడ్ షో లు, సభలు నిర్వహించబోమని, కేవలం చంద్రబాబు ప్రజలతో మమేకం అవుతారని వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణపై కూడా పోలీసులు సంతృప్తి చెందలేదు. కుప్పంలో చంద్రబాబు పర్యటనకు అమతి లేదని తేల్చి చెప్పారు.
కుప్పంలో చంద్రబాబు పర్యటనకు ప్రభుత్వ జీవో అడ్డు వచ్చింది. కుప్పంలోని శాంతిపురం మండలంలో బుధవారం నుంచి చంద్రబాబు సభలు, సమావేశాలు, రోడ్ షో లు ఉంటాయని, అనుమతి కావాలంటూ టీడీపీ నేతలు పోలీసులను అనుమతి కోరారు. అయితే జీవో-1 ప్రకారం కుప్పం పరిధిలో ఎలాంటి సభలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. జనవరి 1నుంచి 30వరకు సభలు, సమావేశాలపై నిషేధం ఉన్నట్టు తెలిపారు చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి. ఈమేరకు ఆయన టీడీపీ నేతలకు నోటీసులు అందించారు. గతేడాది నవంబర్ లో ఇదే డివిజన్ పరిధిలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
నోటీసులకు రిప్లై.. అయినా 'నో'
శాంతిపురంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు సభ నిర్వహించేందుకు టీడీపీ అనుమతి కోరింది. అది జాతీయ రహదారి పక్కనే ఉందన్న కారణంతో డీఎస్పీ అనుమతి ఇవ్వలేదు. అయితే కుప్పంలో ఎవరు సభ పెట్టినా ఎన్టీఆర్ సర్కిల్ అనుకూలంగా ఉంటుందని, ఇప్పుడు కొత్తగా నిబంధనలేంటని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. నోటీసులకు కూడా వారు సమాధానమిచ్చారు. చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే కావడం వల్ల ఆయనకు ప్రజల్ని, ప్రజా ప్రతినిధుల్ని కలుసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. రోడ్ షో లు, సభలు నిర్వహించబోమని, కేవలం చంద్రబాబు ప్రజలతో మమేకం అవుతారని వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణపై కూడా పోలీసులు సంతృప్తి చెందలేదు. కుప్పంలో చంద్రబాబు పర్యటనకు అమతి లేదని తేల్చి చెప్పారు.
పోలీస్ శాఖ అనుమతుల సంగతి ఎలా ఉన్నా పర్యటన కొనసాగించేందుకు చంద్రబాబు నిర్ణయించడం మాత్రం విశేషం. హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానంలో వెళ్లి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో కుప్పం చేరుకుంటారు చంద్రబాబు. మూడురోజుల పర్యటన షెడ్యూల్ ని కూడా టీడీపీ విడుదల చేసింది.