వాడు, వీడు.. లేపేస్తాం.. శృతి మించుతున్న చర్చలు
విమర్శ శృతి మించింది. పబ్లిసిటీకోసం సరికొత్తదారి వెదుక్కుంది. ఇదేదో యూట్యూబ్ ఛానెల్ లో జరిగిన చర్చ అయితే దీని గురించి ఇంత చర్చ అనవసరం.
వాడికి జీవో చదవడం వచ్చా..?
వాడు అసలు ఎమ్మెల్యేగా పనికొస్తాడా..?
జొమాటో డెలివరీ బాయ్ సీఎం అయ్యాడు..
విమర్శ మంచిదే, కానీ ఇలాంటి విమర్శలను ఎవరూ సమర్థించరు. ఒకవేళ ఎవరైనా సమర్థిస్తే.. ఆ తాత్కాలిక ఆనందానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రస్తుతం టీవీ రాజకీయ చర్చల్లో ఇదే జరుగుతోంది. విమర్శ శృతి మించింది. పబ్లిసిటీకోసం సరికొత్తదారి వెదుక్కుంది. ఇదేదో యూట్యూబ్ ఛానెల్ లో జరిగిన చర్చ అయితే దీని గురించి ఇంత చర్చ అనవసరం. సాక్షాత్తూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కి చెందిన సాక్షి ఛానెల్ లో పక్క రాష్ట్ర ముఖ్య మంత్రి గురించి అసహ్యంగా సాగిన రచ్చ ఇది.
నోటిదూల వల్లే ఎన్నికల్లో నష్టపోయామని కొందరు అంటున్నారని, తప్పులుంటే సరి చేసుకుంటామని.. ఆమధ్య మాజీ మంత్రి అనిల్ స్వయంగా ప్రకటించారు. మరో మాజీ మంత్రి రోజా కూడా ఇటీవల హుందాగా మాట్లాడటం మొదలు పెట్టారు. సీనియర్లు ఎలాగూ సైలెంట్ అయ్యారని తెలిసి ఇప్పుడు జూనియర్ బ్యాచ్ హడావిడి మొదలు పెట్టింది. ఎంత తిడితే అంత బాగా మీడియాలో హైలైట్ అవ్వొచ్చు అనే పాలసీని నమ్ముకుంది. అయితే తిట్టేవారు, తిట్టించేవారు కూడా.. అసలు జనం తమ గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని మరచిపోవడమే ఇక్కడ విశేషం.
ప్రతి ఓటమి ఒక గుణపాఠమే. ఓటమికి కారణం ఏదయినా కావొచ్చు, మళ్లీ విజేత కావాలనుకునేవారు ఆ కారణాలు విశ్లేషించుకుని ముందుకు సాగాలి. కానీ ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నదేంటి..? టీవీ చర్చల్లో వాడుతున్న భాష ఏంటి..? దీనికి ముగింపు ఏంటి..?