మరింత ఆలస్యం.. న్యాయశాఖకు ఆర్టీసీ బిల్లు
బిల్లుని ఆమోదించకుండా గవర్నర్ న్యాయశాఖకు పంపించడంతో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. తామిక ప్రభుత్వ ఉద్యోగులమే అని సంబరపడుతున్న 43వేలమంది ఆర్టీసీ కార్మికులు మళ్లీ ఆందోళనలో పడ్డారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విలీన బిల్లు చట్టంగా మారే ప్రక్రియ మరింత ఆలస్యం కాబోతోంది. చట్టసభలు ఆమోదించిన ఈ బిల్లుని న్యాయశాఖ పరిశీలనకు పంపించారు గవర్నర్ తమిళిసై. ఆర్టీసీ బిల్లుతోపాటు మొత్తం 12 బిల్లులను ఆమె న్యాయశాఖకు పంపించినట్టు తెలుస్తోంది.
ఎందుకిలా..?
ఆర్టీసీ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశ పెట్టేముందు ముసాయిదా కాపీని గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. ఆ సమయంలో గవర్నర్, ప్రభుత్వానికి 10 సిఫార్సులు చేశారు. ఆ సిఫార్సులు బిల్లులో ఉన్నాయా, వాటిని కూడా ఆమోదించారా లేదా అని తెలుసుకునేందుకు న్యాయశాఖ పంపించినట్టు రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల భద్రత, సంక్షేమం కోసమే న్యాయశాఖ వివరణ కోరినట్టు రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. బిల్లుపై ఆమోద ముద్ర వేయకుండా ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేస్తున్నారనే వార్తల్ని కూడా ఆ ప్రకటనలో ఖండించారు.
మరింత ఆలస్యం..
బిల్లుని ఆమోదించకుండా గవర్నర్ న్యాయశాఖకు పంపించడంతో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. తామిక ప్రభుత్వ ఉద్యోగులమే అని సంబరపడుతున్న 43వేలమంది ఆర్టీసీ కార్మికులు మళ్లీ ఆందోళనలో పడ్డారు. నిరసనలకు సిద్ధమవుతున్నారు.
కార్యాచరణ..
గతంలో ఆర్టీసీ బిల్లు విషయంలో రాజ్ భవన్ ని ముట్టడించారు కార్మికులు. ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయ్యే అవకాశముందని అంటున్నారు టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి థామస్ రెడ్డి. ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం చేయొద్దని కోరారు. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల సంఘం కార్యాచరణ ప్రకటించే అవకాశముంది.