జనసేనను మూసేస్తారా?

వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ చేస్తున్న నిరాధార ఆరోప‌ణ‌ల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

Advertisement
Update:2023-08-03 10:52 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వలంటీర్ల వ్యవస్థ‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తు నిరాధార ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో వేలాది మహిళలు, అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్‌కు గురవుతున్నారని ఆరోపించారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు వలంటీర్లే కారణమని పవన్ నిరాధార ఆరోపణలు చేశారు. దాంతో గోలగోల అయిపోయింది. పవన్ వ్యాఖ్యలకు నిరసనగా వలంటీర్లు నాలుగు రోజుల పాటు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అయినా పవన్ వెనక్కుతగ్గకుండా పదేపదే రెచ్చిపోతున్నారు.

వైజాగ్‌లో ఒక మహిళను వలంటీర్ హత్యచేశాడని పవన్ రెచ్చిపోయారు. ఈ ఘటనను చూపించి వెంటనే వలంటీర్ వ్యవస్ధను రద్దు చేయాలంటూ గోల చేస్తున్నారు. ఎక్కడో ఇద్దరు ముగ్గురు తప్పుచేస్తే ఏకంగా వ్యవస్థ‌నే రద్దు చేయాలని పవన్ డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. నిజానికి వైజాగ్‌లో మహిళను హత్యచేసిన యువకుడిని వారం రోజుల క్రితమే వలంటీర్‌గా అధికారులు తప్పించేశారు. విధులకు సరిగా రావటంలేదన్న కారణంతోనే తప్పించారు. ఆ తర్వాత వారం రోజులకు అతను దారుణానికి పాల్పడ్డాడు.

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేద్దాం. విజయనగరం జిల్లా ఎస్ కోటలో ఒక మహిళకు డబ్బు ఎరచూసి జనసేన నేత మాదాల శ్రీరాములు లాడ్జికి తీసుకెళ్ళి హత్య చేశాడు. అలాగే హిందుపురంలో జనసేన నేత ఒక వ్యక్తిపై దాడి చేసి 16 తులాల బంగారాన్ని కాజేశాడు. ఇంతకుముందు కూడా కొందరు జనసేనలో యాక్టివ్‌గా తిరిగేవాళ్ళు కొన్ని కేసుల్లో ఇరుక్కున్నారు. అంతెందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు విషయంలో జరిగిన అల్లర్లలో జనసేన నేతలు చాలామందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

పథకం ప్రకారం జరిగిన అల్లర్లలో జనసేన నేతలు కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. మరి ఇప్పుడు జనసేన పార్టీని రద్దు చేసుకుంటారా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు పవ‌న్‌ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మంచి, చెడు అందరిలోనూ ఉంటుందని గ్రహించలేని పవన్ జనాలకు మంచి చేస్తున్న వలంటీర్ల వ్యవస్థ‌పై బురదచల్లటం ఏమాత్రం తగదంటు హితవు చెబుతున్నారు. ఇకముందైనా వలంటీర్ల వ్యవస్థ‌, వలంటీర్లపై మాట్లాడేటప్పుడు పవన్ జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు సలహాలిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News