టీడీపీలో కోటంరెడ్డి కిరికిరి

టీడీపీ నేతలపై దాడులు చేసినవారు, కేసులు పెట్టినవారు, బెట్టింగ్ బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని బెదిరించేవారు.. ఇలాంటి గంజాయి మొక్కలు టీడీపీలోకి అవసరం లేదని పరోక్షంగా కోటంరెడ్డిని కామెంట్ చేశారు అబ్దుల్ అజీజ్.

Advertisement
Update:2023-02-13 07:04 IST

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపుగా టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. ముందస్తుగానే చంద్రబాబు, లోకేష్ తో ఆయన మంతనాలు జరిపారనేది బహిరంగ రహస్యం. అయితే తనకు తాను సీటు ప్రకటించుకోకుండా, చంద్రబాబు అవకాశమిస్తే పోటీ చేస్తానని చెప్పుకొస్తున్నారు కోటంరెడ్డి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఊహించని ప్రతికూల వ్యాఖ్యలు వినపడుతున్నాయి. చంద్రబాబు, లోకేష్ అలా చెప్పమన్నారో, లేక తనకు తానే కోటంరెడ్డిని టెన్షన్ పెట్టేందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ, స్థానిక టీడీపీ ఇన్ చార్జ్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంజాయి మొక్కలు తమ పార్టీలోకి వద్దని అన్నారు.

టీడీపీ నేతలపై దాడులు చేసినవారు, టీడీపీ నేతలపైనే కేసులు పెట్టినవారు, బెట్టింగ్ బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని బెదిరించేవారు.. ఇలాంటి గంజాయి మొక్కలు టీడీపీలోకి అవసరం లేదని పరోక్షంగా కోటంరెడ్డిని కామెంట్ చేశారు అబ్దుల్ అజీజ్. ఇటీవలే చంద్రబాబు, లోకేష్ తో తాను మాట్లాడానని.. అసలు కోటంరెడ్డి వ్యవహారం సోదిలో కూడా లేదని అన్నారు. తన పని తనని చేసుకుని వెళ్లాలని చెప్పారన్నారు.

కోటంరెడ్డి ఎపిసోడ్ తర్వాత, నెల్లూరు జిల్లా టీడీపీలో కలవరం మొదలైంది. కోటంరెడ్డి రూరల్ సీటు ఖాయమంటున్నారు, రామనారాయణ రెడ్డి మరో సీటుకి పోటీగా వస్తున్నారు, ఈ దశలో ఇప్పటి వరకు పార్టీని నమ్ముకుని, టికెట్లపై ఆశలు పెట్టుకున్నవారు ఏం కావాలనే ప్రశ్నలు వినపడుతున్నాయి. అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చే హామీలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ అధికారం దక్కకపోతే అప్పుడు ఇంకా ఘోరం. అందుకే ఎమ్మెల్యే సీటు త్యాగం చేయడానికి టీడీపీ నేతలెవరూ సిద్ధంగా లేరు. ఒకవేళ అదృష్టం బాగుండి ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలాగూ ఫిరాయింపు అస్త్రం ఉంటుంది కాబట్టి ఎటు కావాలంటే అటు మారిపోవచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా చెలామణి అయిపోవచ్చు. అందుకే అందరూ పోటీకి ఉత్సాహంగా ఉన్నారు, హామీలతో మోసపోయేలా లేరు. ఈ దశలో ఇప్పుడు నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ కోటంరెడ్డికి అనే ప్రకటన విడుదల కాకపోయినా ఆ పార్టీలో హడావిడి నెలకొంది. నేరుగా కోటంరెడ్డినే టీడీపీ నేతలు టార్గెట్ చేశారు కాబట్టి, ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగే అవకాశముంది. సరైన టైమ్ లో సరైన నిర్ణయం అంటూ కాలయాపన చేసే చంద్రబాబు ఈసారి ఏం చేస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News