నెల్లూరు కుర్రాడు.. ఆస్ట్రేలియాలో చదువు మానేసి చాయ్‌తో రూ.5 కోట్లు సంపాదన

మెల్‌బోర్న్‌ నగరంలో ఎపుడూ రద్దీగా ఉండే సీబీడీ (సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌) ప్రాంతంలోని ఎలిజబెత్‌ స్ట్రీట్‌లో 'డ్రాప్ అవుట్‌ చాయ్‌వాలా' పేరుతో కాఫీ షాప్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే మంచి ఆదరణ లభించింది.

Advertisement
Update:2022-11-09 19:21 IST

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో డ్రాప్ అవుట్‌గా మారాడు. ఎంతో మంది మహానుభావులు చెప్పినట్టు సక్సెస్ కాదు.. ఓటమి మనకు ఎన్నో నేర్పిస్తుంది. సక్సెస్ అయితే ఏదో ఒక ఉద్యోగం సంపాదించి జీవితాన్ని కొనసాగించేవాడు. కానీ డ్రాప్ అవుట్ కావడంతో నలుగురికి ఉద్యోగం కల్పించే స్థితికి వెళ్లాడు. అసలు విషయంలోకి వెళితే.. నెల్లూరుకు చెందిన కొండా సంజిత్ (22) ఆస్ట్రేలియాలో లా ట్రోబ్‌ అనే దిగ్గజ యూనివర్సిటీలో బీబీఏ (బ్యాచిలర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌)లో సీటు సంపాదించాడు. కానీ కోర్సు పూర్తి చేయడంలో విఫలమై, కాలేజీ డ్రాప్ అవుట్‌గా మారిపోయాడు.

ఇక మంచి ఉద్యోగమైతే ఆశించలేడు. మరి ఏం చేయాలి? బుర్రకు పదును పెట్టాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరం కాఫీకి ప్రసిద్ధి. అందుకే ఒక కాఫీ షాప్ తెరిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే వారు అక్కడికి వెళ్లి కాఫీ షాప్ పెట్టుకోవడమేంటంటూ అభ్యంతరం తెలిపారు. కానీ వారికి సంజిత్ నచ్చజెప్పాడు. మెల్‌బోర్న్‌ నగరంలో ఎపుడూ రద్దీగా ఉండే సీబీడీ (సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌) ప్రాంతంలోని ఎలిజబెత్‌ స్ట్రీట్‌లో 'డ్రాప్ అవుట్‌ చాయ్‌వాలా' పేరుతో కాఫీ షాప్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే మంచి ఆదరణ లభించింది.

ఇప్పుడు అక్కడ మన నెల్లూరు కుర్రాడి చాయ్‌ అంటే అటు భారతీయులతో పాటు ఆస్ట్రేలియావాసులకు కూడా ఆసక్తి పెరిగింది. వేడి వేడి కాఫీని టేస్ట్ చేస్తూ సమోసాలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏడాదిలోనే రూ.5 కోట్ల టర్నోవర్‌ సాధిస్తున్నానని సంజిత్‌ తెలిపాడు. అస్రార్‌ అనే ఒక ప్రవాసుడు తన ప్రాజెక్టును నమ్మి.. ఏంజెల్‌ ఇన్వెస్టర్‌గా మారడానికి ఒప్పుకున్నారని వెల్లడించాడు. వచ్చే నెలతో తన ప్రాజెక్టుకు ఏడాది పూర్తవుతుందని వెల్లడించాడు. ఇక పన్నులు పోగా అతని ఆదాయం 1 మిలియన్‌ ఆస్ట్రేలియా డాలర్ల (దాదాపు రూ.5.2 కోట్లు)కు చేరనుంది. దీనిలో లాభం 20% దాకా ఉండొచ్చు. ఇక అక్కడి మన భారతీయులేమో ఇష్టంగా 'బాంబే కటింగ్‌' టీని.. ఆస్ట్రేలియన్లు మన 'మసాలా చాయ్‌', పకోడాలపై అమితాసక్తిని చూపిస్తారట. ఇక త్వరలోనే రెండో అవుట్‌లెట్‌‌ను కూడా తెరవనున్నట్టు సంజిత్ చెబుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News