ఏపీ చీఫ్ సెక్రటరీపై ముప్పేట దాడి..
కూటమి నేతల ఆరోపణలపై సీఎస్ కూడా అంతే ధీటుగా స్పందించడం విశేషం. తప్పుడు ఆరోపణలు చేసిన మూర్తి యాదవ్ కి లీగల్ నోటీసులు జారీ చేస్తామని సీఎస్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
ఎన్నికల వేళ.. ఏపీ చీఫ్ సెక్రటరీ, డీజీపీ.. ఇద్దరి బదిలీకోసం కూటమి ప్రయత్నించింది. డీజీపీ విషయంలో వారి కోరిక నెరవేరింది కానీ, చీఫ్ సెక్రటరీపై మాత్రం ఈసీ బదిలీ వేటు వేయలేదు. దీంతో ఆయనపై రోజూ బురదజల్లే కార్యక్రమం మొదలు పెట్టింది కూటమి. సీఎస్ పై కూటమి నేతలు రోజుకో కొత్త ఆరోపణ చేస్తుండగా.. ఎల్లో మీడియా ఆ ఆరోపణలను హైలైట్ చేస్తోంది. అయితే ఈ ఆరోపణలపై సీఎస్ కూడా అంతే ధీటుగా స్పందించడం విశేషం.
ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడిపై విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో 2 వేల కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాలు అసైన్డ్ భూముల్ని జవహర్ రెడ్డి కుమారుడు సొంతం చేసుకున్నారని అన్నారు మర్తి యాదవ్. ఈ ఆరోపణలు పూర్తి అవాస్తవం అంటున్న సీఎస్, ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. అయినా కూడా మూర్తి యాదవ్ ఆరోపణలు ఆపకపోవడంతో.. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులను సంప్రదించినట్లు తెలిపారు సీఎస్. త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్‌కు లీగల్ నోటీసు జారీ చేస్తామని సీఎస్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారుల ఫైల్ విషయంలో సీఎస్ అత్యుత్సాహం చూపిస్తున్నారని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు కూడా ఇదే విషయంపై లేఖ రాశారు. కన్ఫర్డ్ ఐఏఎస్ ఫైల్ పై సీఎస్ కి అంత తొందర ఎందుకని మాజీ మంత్రి సోమిరెడ్డి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు ఎన్నికల నిర్వహణ విషయంలో కూడా సీఎస్ ని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల వేళ సీఎస్ పై ఈసీ బదిలీ వేటు వేయకపోవడంతో టీడీపీ మరో విధంగా ఒత్తిడి పెంచుతోంది, ప్రతి నిత్యం విమర్శలతో సీఎస్ ని టార్గెట్ చేస్తోంది.