మీసం తిప్పిన నారా లోకేష్.. తొడగొట్టిన మిథున్ రెడ్డి
తంబళ్లపల్లెలో చర్చకు రావాలంటూ సవాల్ విసిరిన లోకేష్ కి బాలయ్య సినిమా డైలాగ్ తో కౌంటర్ ఇచ్చారు మిథున్ రెడ్డి. చర్చకు తాను సిద్ధమేనని, ప్లేస్ లోకేష్ చెప్పినా సరే, తనను చెప్పమన్నా సరేనన్నారు.
ఆమధ్య దమ్ముందా, ధైర్యముందా అంటూ చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి మధ్య సవాళ్లు నడిచాయి. వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తానని ఒకరంటే, నీ సంగతి తేలుస్తానంటూ మరొకరు మాటల యుద్ధానికి దిగారు. ఇప్పుడు వారి కొడుకులు రంగంలోకి దిగారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు వస్తావా అంటూ పెద్దిరెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డికి సవాల్ విసిరారు నారా లోకేష్. ఈ సవాల్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. తాను తంబళ్లపల్లెలోనే ఉంటానని చర్చకు తాను సిద్ధమేనని చెప్పారు.
అసలు లోకేష్ ఏమన్నారు..?
అన్నమయ్య జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేష్, మంత్రి పెద్దిరెడ్డి కుటుంబపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాని గుప్పెట్లో పెట్టుకొని దోచుకోవడమే పెద్దిరెడ్డి కుటుంబం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. మదనపల్లెకి ఏమి చేశావ్ మిథున్ రెడ్డీ అని ప్రశ్నించారు లోకేష్. తంబళ్లపల్లెలోనే ఉంటాను, దమ్ముంటే రా అంటూ సవాల్ విసిరారు. నన్ను అరెస్టు చేయొద్దు అంటూ ముందుగానే బెయిల్ తీసుకునే టైపు తాను కాదన్నారు లోకేష్. తాము తప్పులు చేయబోమని, అభివృద్ధి మాత్రమే చేస్తామన్నారు లోకేష్.
ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే..
తంబళ్లపల్లెలో చర్చకు రావాలంటూ సవాల్ విసిరిన లోకేష్ కి బాలయ్య సినిమా డైలాగ్ తో కౌంటర్ ఇచ్చారు మిథున్ రెడ్డి. చర్చకు తాను సిద్ధమేనని, ప్లేస్ లోకేష్ చెప్పినా సరే, తనను చెప్పమన్నా సరేనన్నారు. ఈనెల 12 న తంబళ్లపల్లెలోనే ఉంటా, ఏం చేస్తావో చేసుకో అన్నారు. నారా లోకేష్ లో ప్రవహించేది చిత్తూరు జిల్లా రక్తం అయితే జిల్లాలో ఏ సీటు నుండి అయినా పోటీ చేసి తనపై గెలవాలన్నారు. చర్చకైనా, పోటీకైనా తాను సిద్ధమేనని, లోకేష్ రెడీయా అంటూ సవాల్ విసిరారు. లోకేష్, మిథున్ రెడ్డి మాటల తూటాలు ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచాయి.