నన్నుచూసి వాళ్ల ఫ్యాంట్ లు తడిచిపోయాయి..
క్లెమోర్ మైన్లకే భయపడని కుటుంబం తమదని, కోడిగుడ్లకు తానెందుకు భయపడతానన్నారు. కోడిగుడ్లు వేసిన కోడికత్తి బ్యాచ్ మొహానే వాటిని ఆమ్లేట్లుగా వేసి పంపించామన్నారు నారా లోకేష్.
నెల్లూరు జిల్లా యువగళం యాత్రలో జోరు పెంచారు నారా లోకేష్. జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి జై కొట్టడంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. ఇన్నాళ్లూ ఏ పార్టీలో చేరేది చెప్పకుండా సైలెంట్ గా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, లోకేష్ యాత్రకు ముందే టీడీపీకి జై కొట్టి యువగళంలో కలసి నడుస్తున్నారు. అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా బహిరంగ సభలో నారా లోకేష్ స్థానిక వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. తాను జిల్లాలో ఎంట్రీ ఇవ్వగానే వారి ఫ్యాంట్ లు తడిచిపోయాయని అన్నారు లోకేష్.
సీఎం జగన్ కు మైథోమానియా సిండ్రోమ్ ఉందని, అందుకే ఆయన పదే పదే తాను పేదవాడిని అని అబద్ధం చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు లోకేష్. లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్దం చెప్పుకుంటున్నారని సెటైర్లు పేల్చారు. నెల్లూరు జిల్లా రెడ్డి సోదరులు మరోసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. జగన్ ని నమ్ముకుంటే ఏ వర్గానికి న్యాయం జరగలేదని, అన్ని వర్గాలకు టీడీపీ హయాంలోనే సమ న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు.
కోడిగుడ్లకు భయపడతానా..?
కడప జిల్లాలో తనపై కోడిగుడ్ల దాడి జరిగిందని గుర్తు చేశారు లోకేష్. క్లెమోర్ మైన్లకే భయపడని కుటుంబం తమదని, కోడిగుడ్లకు తానెందుకు భయపడతానన్నారు. కోడిగుడ్లు వేసిన కోడికత్తి బ్యాచ్ మొహానే వాటిని ఆమ్లేట్లుగా వేసి పంపించామన్నారు. విశాఖపట్నంను క్రైమ్ క్యాపిటల్ గా చేశారని, సాక్షాత్తు ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కావడం శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. మంత్రి పేషీలోని ఉద్యోగులకే ప్రభుత్వం జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉందన్నారు. ఆత్మకూరుకి రావాల్సిన పరిశ్రమలను పక్క జిల్లాలకు తరలించిన సీఎం జగన్, దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి లేకుండా చేశారన్నారు నారా లోకేష్.