కపట నాటకాలకు కాలం చెల్లింది.. నారా లోకేష్ ఘాటు ట్వీట్

జగన్ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం తమది కాదని, ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇదని చెప్పారు లోకేష్.

Advertisement
Update:2024-07-18 15:14 IST

ఇన్నాళ్లూ రాష్ట్రంలో ఎక్కడ ఏ విధ్వంసం జరిగినా ప్రతిపక్షం ఆవేదన వ్యక్తం చేసింది కానీ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. వినుకొండ ఘటన మాత్రం అందుకు విరుద్ధం. నడిరోడ్డుపై జరిగిన హత్య ఇది. రాజకీయ కారణాలను పక్కనపెడితే.. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్య ఇటీవల కాలంలో ఇదే మొదటిది. ఇలాంటి దారుణాన్ని ఎవరూ సమర్థించరు, సహించరు. అయితే ఇక్కడ కూడా రాజకీయ కక్షలు వెలుగులోకి రావడం విశేషం. వైసీపీ, టీడీపీ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. నేరుగా ఇక్కడ జగన్ రంగంలోకి దిగారు. ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఆయన ట్వీట్ వేశారు. ఇటు ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ ఆయనకు బదులిచ్చారు. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్, ఫేక్ ప్రచారాలపై, అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారని మండిపడ్డారు.


హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం రోత పుట్టిస్తోందంటూ ఘాటు ట్వీట్ వేశారు మంత్రి నారా లోకేష్. బాధితులనే నిందితులు చేసి, గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటిందని తన ట్వీట్ లో పేర్కొన్నారు. మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూటమి ప్రభుత్వం కూకటివేళ్లతో పెకిలించి వేస్తుందని చెప్పారు. బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదని బదులిచ్చారు. జగన్ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం తమది కాదని, ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇదని చెప్పారు లోకేష్.

కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపై అఘాయిత్యాలతోపాటు.. చాలా చోట్ల దాడులు పెచ్చుమీరాయి. గతంలో కూడా నేరాలు ఇలానే ఉన్నాయని, కావాలని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారని, కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని టీడీపీ కవర్ చేస్తూ వచ్చింది. కానీ నడిరోడ్డుపై జరిగిన హత్య ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. దీంతో నారా లోకేష్ ఇలా ఘాటుగా స్పందించాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News